
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరనా వైరస్ వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మహమ్మారి నుండి తమను కాపాడే సంజీవనిని ఎవరు తయారుచేస్తారా అనే అంశం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా పలు దేశాలకు చేందిన సైంటిస్టులు కరోనాకు మందును కనిపెట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే భారత్‌లోని పలువురు రాజకీయ నేతలు మాత్రం తమకు ఇష్టమొచ్చింది చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే పనిలో ఉన్నారు.
ఇటీవల కేంద్రమంత్రి అర్జున్ ముండా అప్పడాలు తింటే కరోనా సోకదని చెప్పి వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పిన బ్రాండ్ అప్పడాలు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా కరోనా సోకదని ఆయన చెప్పారు. అయితే ఆయనకు ఇటీవల కరోనా సోకడంతో ఆయన్ను చూసి నవ్వాలో, జాలి పడాలో తెలియలేదు జనాలకు. ఇప్పుడు బీజేపీకి చెందిన మరో ఎంపీ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎంపీ సుఖ్బీర్ సింగ్ జౌనపూరియా బురదలో కూర్చుని శంఖం ఊదితే కరోనా వైరస్ దరిచేరదని ఆయన అంటున్నాడు.
శంఖం ఊదుతూ బురదలో కూర్చుంటే రోగ నిరేధక శక్తి పెరుగుతుందని, తద్వారా కరోనా గిరోనా మన దరిచేరవని ఆయన అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దన పలువురు ఆయనకు సూచిస్తున్నారు. ఏదేమైనా ఓ బాధ్యతగల పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ప్రతిపక్ష నేతలు ఆయనపై మండిపడుతున్నారు.