వ్యాక్సిన్ విషయంలో చేతులు ఎత్తేసిన ఏపీ ప్రభుత్వం! మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు వైరల్!

కరోనా తాకిడికి సామాన్య జనాల జీవితాలు నీటి బుడగల మాదిరిగా తయారయాయ్యి. ఈరోజు మన కళ్ళ ముందు ఉన్న వారు.., రేపటికి ఎలా ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక ఒకవేళ పాజిటివ్ వస్తే పట్టించుకునే నాధుడు లేక ప్రజలు అల్లాడుతున్నారు. పొరపాటున పరిస్థితి సీరియస్ అయితే హాస్పిటల్స్ లో లక్షలు కుమ్మరించాల్సి వస్తోంది. పోనీ.., ఇంతా కడితే ప్రాణాలకి గ్యారంటీ ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితి. బెడ్స్ దొరకడం లేదు, ఆక్సిజన్ అందటం లేదు. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు ప్రభుత్వాలపై అసహనం ప్రదర్శించడం అనేది చాలా మామూలు విషయమే. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణ చర్యలు అంత అంత మాత్రంగానే ఉన్నాయి. కానీ.., తెలంగాణతో పోల్చి చూస్తే.. ఏపీలో కొంత మేర పరిస్థితి పరవలేదు. ఇక్కడ ఇంకా టెస్ట్ లు కొనసాగుతున్నాయి. క్వారెంటైన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ విషయంలో వైసీపీ చర్యలను మెచ్చుకుని తీరాల్సిందే. కానీ.., వ్యాక్సినేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ నాయకుల కామెంట్స్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చకి కారణం అవుతున్నాయి.

ప్రస్తుతం అందరికీ వ్యాక్సిన్ సంజీవనిలా కనిపిస్తోంది. దీనితో మిగతా రాష్ట్రాలు పెద్ద ఎత్తున సొంతగా టీకా ఆర్డర్ ఇచ్చాయి. నార్త్ లో కొన్ని చోట్ల 18 ఏళ్ళు దాటిన వారికి కూడా టీకా అందుబాటులో ఉంది. కేంద్రం కూడా, రాష్ట్రాలను సొంతగా టీకా కొనటానికి అనుమతి ఇచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇలాంటి సమయంలో కూడా కేవలం 13 లక్షల టీకాలు ఆర్డర్ ఇచ్చింది. ఇక అంతకు మించి వ్యాక్సిన్స్ మాకు దొరకడం లేదు అంటూ స్వయంగా ప్రభుత్వ యంత్రాగమే చేతులు ఎత్తేసిన పరిస్థితి. రాష్ట్రంలో ఎందుకు అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో లేదు అని ప్రతి పక్షాలు ప్రశ్నిస్తే మంత్రి గారు ఇచ్చిన సమాధానం ఇది. “మేము మీకు 1600 కోట్లు ఇస్తాం, ఎవరి ఎకౌంటు లో వేయాలో చెప్పండి వేస్తాం, మీరు వ్యాక్సిన్ లు తెచ్చి పెట్టండి” అంటూ నాని తన అసహనాన్ని తెలియచేశాడు. కానీ.., ఇక్కడ అర్ధం కాని విషయం ఏమిటంటే మిగతా రాష్ట్రాల వారికి దొరుకుతున్న వ్యాక్సిన్ ఏపీకి ఎందుకు లభ్యం కావడం లేదు? ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు ఫెయిల్యూర్ అయ్యిందన్న ప్రశ్నలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి.., ఇకనైనా ఏపీ ప్రభుత్వం వ్యాక్సిన్ విషయంలో మరింత దూకుడుగా ముందుకి వెళ్తుందేమో చూడాలి.