
పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వలసవెళ్లే వారి బ్రతుకులు ఎంత దుర్భరంగా మారుతున్నాయో మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా గల్ఫ్ లాంటి దేశాల్లో ఇక్కడి ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. చాలీచాలని జీతం, ఒక్కపూట తిండితో తమ కుటుంబ బాధ్యతల కోసం అక్కడ వెట్టి చాకిరీ చేస్తున్న వారి సంఖ్య చాలా పెద్దగా ఉంటుంది. కాగా తెలంగాణ రాష్ట్రం నుండి గల్ఫ్ బతుకుతెరువు కోసం వలస వెళ్లిన వారిలో అక్కడ పనిలేక చిక్కుకుపోయిన వారి సంఖ్య కూడా చాలా ఉంటుంది.
అయితే అలాంటి వారందరికీ నేనున్నాను అంటూ ముందుకొచ్చారు టీఆర్ఎస్ మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. గల్ఫ్ దేశంలో చిక్కుకుపోయిన తెలంగాణ ప్రజలను ఇక్కడి రప్పించి వారి కుటుంబ సభ్యులతో కలిపే కార్యక్రమాన్ని ఆమె గతంలోనే ప్రారంభించింది. కాగా ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా గల్ఫ్‌లో ఉపాధి కోల్పోయినటువంటి వారిని వెనక్కి తమ స్వదేశానికి తీసుకొచ్చి, వారిని సొంతూళ్లకు పంపేందుకు, కవిత తన సొంత ఖర్చులతో బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా వేల సంఖ్యలో అక్కడి నుండి వలసజీవులు కవిత పుణ్యమా అని తమ సొంతవాళ్లను కలుసుకుంటున్నారు.
ఏదేమైనా బతుకుతెరువు కోసం ఇతర దేశాలకు వెళ్లి బ్రతకడమే కష్టంగా మారి చనిపోయేందుకు సిద్ధమవుతున్న వారికి కవిత తనవంతు సాయంగా ఈ కార్యక్రమాన్ని చేస్తుండటంతో ప్రజలు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఇలాంటి మంచి పనులు చేస్తుండటం నిజంగా కవిత గొప్పతనం అని పలువురు అంటున్నారు.