
నేటి ప్రపంచంలో చాలామంది స్మార్ట్ ఫోన్ వాడుతూ సోషల్ మీడియాలోనే మునిగితేలుతున్నారు. అయితే వారికి సోషల్ మీడియానే లోకం అనేలా ప్రవర్తిస్తుంటారు. కానీ వారి కొంపముంచేది కూడా ఆ సోషల్ మీడియానే అనే నిజాన్ని తాజాగా ఓ సర్వే తేల్చేసింది. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాను వినియోగిస్తున్న వారికి సంబంధించిన డేటాను ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు లీక్ చేసినట్లు తెలుస్తోంది.
ఇంస్టాగ్రామ్, యూట్యూబ్, టిక్‌టాక్ వాడుతున్న 23.5 కోట్ల మంది యూజర్ల డేటా లీక్ అయినట్లు కంపేర్టెక్ అనే సంస్థ వెల్లడించింది. యూజర్ల పేరు, వారి పూర్తి పేరు, ప్రొఫైల్ ఫోటో, చిరునామా, ఫోన్ నెంబర్ వంటి డేటా లీక్ అయ్యిందని, దీనికి వెనుక ‘డీప్ సోషల్’ అనే సంస్థ ఉన్నట్లు సర్వేలో తేలిందని కంపేర్టెక్ తెలిపింది. ఇంటర్నెట్లో మనకు కనిపించకుండా ఉండే డార్క్ వెబ్ అనే భాగంలో ఈ డాటా అంతా ఉందని, దాన్ని డీప్ సోషల్ సంస్థ లీక్ చేసినట్లు తెలుస్తోంది.
ఎలాంటి లాగిన్ అవసరం లేకుండానే యూజర్ల డేటాను కొల్లగొట్టడం దీని ప్రత్యేకత అని, అందుకే సోషల్ మీడియాలో ఎక్కువగా లాగిన్ అయ్యి ఉండవద్దని కంపేర్ టెక్ సూచిస్తోంది. ఇంత భారీ స్థాయిలో యూజర్ల డేటా లీక్ కావడంపై ఇంస్టాగ్రామ్, యూట్యూబ్, టిక్‌టాక్ సంస్థలు ఇప్పటివరకు స్పందించలేదు. గతంలో ఫేస్బుక్ యూజర్ల డేటా లీక్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఈ వివాదం ఎక్కడివరకు దారితీస్తుందో చూడాలి.