
ఎన్నో శతాబ్దాల కల నేడు సాకారం కానుంది. భారతదేశ ప్రజలు తమ ఆరాధ్యదైవం అయిన శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం నేడు నిజరూపం దాల్చనుంది. కొన్నేళ్లుగా ఈ వివాదాన్ని రాజకీయం చేస్తున్న వారికి నేడు చెంపపెట్టు అవుతుందని, హిందువుల చిరకాల కోరిక నేటితో తీరుతోందని, యావత్ భారతావని శ్రీరాముడి మందిర శంకుస్థాపనతో పునీతమవుతోందని చాటి చెప్పే మహత్కర సన్నివేశం నేడు(ఆగష్టు 5) ఆవిష్కృతం కానుంది.
భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మస్థలం అయిన అయోధ్యలో ఎట్టకేలకు శ్రీరామ మందిర నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఈ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేస్తుండటంతో భారతీయుల సంతోషానికి ఆకాశమే హద్దుగా మారింది. హిందువులు ఈ క్షణం కోసం కొన్ని శతాబ్దాలుగా ఎదురుచూస్తున్నారని, వారి కలను నెరవేర్చిన మోదీకి యావత్ భారతదేశం తరఫున హిందువులు తమ ధన్యవాదాలను తెలుపుతున్నట్లు సోషల్ మీడియాలో అయోధ్య రాముడి మందిరం శంకుస్థాపను ట్రెండింగ్లో పెట్టారు.
అయోధ్య రామ మందిరం పేరుతో భారత్ మొత్తం ఊగిపోతుందని, కులమతాలకు అతీతంగా ఈ క్షణం కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారని పలువురు అంటున్నారు. ఇక మోదీ చెప్పినట్లుగానే అయోధ్యలో రామ మందిర నిర్మాణానికే ఆయన అక్కడి వెళ్తుండటంతో అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏదేమైనా శ్రీరాముడి మందిర నిర్మాణం మొదలవుతుండటంతో సోషల్ మీడియాలోనూ భక్తి పెరిగిపోయినట్లు మనకు కనిపిస్తుంది. మొత్తానికి రామ మందిర నిర్మాణం ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకట్టుకునేలా చేసింది.