నాడు తన అన్నయ్య చిరంజీవి స్థాపించిన “ప్రజారాజ్యం” పార్టీ ఎన్ని కష్టాలు ఎదుర్కుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి కష్టాలే నేడు తమ్ముడు, జనసేన అధినేత “పవన్ కళ్యాణ్” కు కూడా వస్తున్నాయా ? అనే అనుమానాలు మొదలయ్యాయి. నిన్నటివరకు జనసేన పార్టీ నుండి ఎలాంటి తప్పుడు వార్తలు రాలేదు.. కానీ పవన్ అన్నయ్య నాగబాబు పార్టీలో అడుగు పెట్టదో లేదో.. ఆయనపై నెగిటివ్ వార్తలు వస్తున్నాయి..
ప్రశాంతంగా ఉంటున్న తమ కుటుంబాన్ని, టికెట్ ఇస్తానని చెప్పి తిరిగి రాజకీయాల్లోకి రప్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తమను, తమ కుటుంబాన్ని మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే “అల్లు భానుమతి” మీడియా ముందుకు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె… ఉన్నత చదువులు చదివిన తన మనవడు “రఘురాజు”కు పవన్ కళ్యాణ్ “మాడుగుల” నుంచి టికెట్ ఇస్తానని చెప్పాడు.. దాంతో రఘురాజు భవిష్యత్తు కోసం ఆ పార్టీలో చేరాము, ఇంటింటికీ తిరిగి ఓటు వేయాలని ప్రచారం చేసిన తరువాత, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మేలు కలిగించేలా “సన్యాసినాయుడి”కి టికెట్ ఇచ్చారని ఆరోపించారు.
అక్కడితో ఆగని ఆమె సమాజంలో మార్పు రావాలని కోరుకుంటున్నానని చెప్పే పవన్ కళ్యాణ్ ఇలా మోసం చేయడం దారుణమని ఆమె వ్యాఖ్యానించారు. పవన్ చెప్పారని తాము ప్రచారం కూడా చేసుకుంటుంటే, మరో వ్యక్తికి టికెట్ ఇవ్వడం ద్వారా తమను వీధుల్లోకి ఈడ్చి, దగా చేసినట్లయిందని విమర్శలు గుప్పించారు మాజీ MLA భానుమతి.