
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించిన వికేంద్రీకరణ బిల్లుకు హైకోర్టులో బ్రేక్ లు పడ్డాయి. గత నెల జూలై 31వ తారీఖున అధికార వికేంద్రీకరణ ఆమోదం మరియు సీఆర్డీఏ బిల్లు రద్దు అయినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఏర్పడినట్లు అధికారికంగా జగన్ సర్కార్ డిక్లేర్ చేసింది. అయితే ఇప్పుడు ఈ అంశం న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకుంది. వికేంద్రీకరణ బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని అమరావతి రైతులు హైకోర్టు ఆశ్రయించారు.
నేడు రాజధాని విభజన పిటిషన్లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులైన శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ గట్టి కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం గవర్నర్ గెజిట్‌పై స్టేటస్ ఇచ్చింది. అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై కూడా స్టే విధించింది. ఆగస్టు 14 వరకు స్టే వర్తిస్తుందని కోర్టు తెలిపింది. తదుపరి విచారణలోగా పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణకు 14వ తేదీకి వాయిదా వేసింది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుకు జూలై 31వ తేదీన గవర్నర్ విశ్వభూషణ్ పరిచందన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
క్రితం గవర్నర్ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం తెలపడంతో జగన్ సర్కార్ విశాఖ నుండి పరిపాలన సాగించాలని అనుకుంది. దీనిలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల తరలింపుకు కూడా సిద్ధమైంది. ఇటువంటి సమయంలో హైకోర్టు స్టే ఇవ్వడంతో జగన్ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగలింది. వికేంద్రీకరణ బిల్లుపై జగన్ సర్కార్ న్యాయపోరాటం చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేస్తూనే ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవహరించిన తీరును హైకోర్టు సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించాయి. ఇప్పుడు రాజధాని అంశం ఇంకెన్ని వివాదాలకు దారితీస్తుందోనని మేధావులు అభిప్రాయపడుతున్నారు.