
కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో ప్రతియేటా జరిగే బ్రహ్మోత్సవాల కోసం యావత్ భక్తజనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక ఆ బ్రహ్మాండ దేవుడి బ్రహ్మోత్సవాలను జీవితంలో ఒక్కసారైనా కనులారా వీక్షించాలని తపించే భక్తులు కోట్ల సంఖ్యలో తిరుమల కొండకు చేరుకుంటారు. ప్రతియేటా అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకలను చూసేందుకు దేశ నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. కాగా ఈయేడు కరోనా వైరస్ కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయా లేదా అనే సందేహం అందరిలోనూ నెలకొంది.
అయితే తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి బ్రహ్మోత్సవాలపై క్లారిటీ ఇచ్చేసింది. ఈయేడు కూడా దేవదేవుడి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు తితిదే సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి 27 వరకు తిరుమల బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తితిదే ఓ ప్రకటనో వెల్లడించింది. కాగా సెప్టెంబర్ 19న అంకురార్పణంతో ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. కాగా ఈ బ్రహోత్సవాల్లో కీలకమైన ఘట్టాలు ధ్వజారోహణం – సెప్టెంబరు 19, గరుడ వాహన సేవ – సెప్టెంబర్ 23, స్వర్ణ రథోత్సవం – సెప్టెంబర్ 24, రథోత్సవం – సెప్టెంబర్ 26, చక్రస్నానం, ధ్వజావరోహణం – సెప్టెంబర్ 27 తేదీల్లో జరగనున్నాయి.
కాగా ప్రస్తుతం కరోనా నేపథ్యంలో భక్తుల అనుమతి, వారికి సంబంధించిన మార్గదర్శకాలను టీటీడీ త్వరలోనే విడుదల చేయనున్నట్లు పేర్కొంది. మరి కరోనా కారణంగా ఈసారి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయా అనే సందేహం సర్వత్రా నెలకొనగా, బ్రహ్మాండ నాయకుడి ఆశీస్సులతో ఈ విపత్తు త్వరలోనే తొలిగిపోతుందని పలువురు అంటున్నారు. ఏదేమైనా తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో భక్తజనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.