
తిరుమల పుణ్యక్షేత్రానికి ఎంత ప్రత్యేకత ఉందో తిరుపతి లడ్డూకి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. తిరుమలకు వచ్చే భక్తులకు ప్రసాదంగా అందించే తిరుపతి లడ్డూ పంపిణీ విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తిరుపతి లడ్డూని అందించేందుకు ప్లాస్టిక్ కవర్లను టీటీడీ వినియోగించేంది. అయితే ప్లాస్టిక్ కవర్ల కారణంగా వాతావరణం కాలుష్యం అవుతుందనే ఉద్దేశ్యంతో ఇప్పుడు వాటికి స్వస్తి చెప్పేందుకు టీటీడీ నిర్ణియించుకుంది.
ఇందులో భాగంగా ఇకపై తిరుపతి లడ్డూలను అందించేందుకు జ్యూట్ బ్యాగులను వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది. లడ్డూలను బట్టి బ్యాగ్ సైజులు ఉంటాయని, భక్తులు ఇకపై జ్యూట్ బ్యాగులనే వినియోగించాలని టీటీడీ తెలిపింది. 5 లడ్డులు పట్టే బ్యాగ్ ధర రూ.25, 10 లడ్డూలు పట్టే బ్యాగ్ ధర రూ.30, 15 లడ్డూలు పట్టే బ్యాగ్ ధర రూ. 35, 25 లడ్డూలు పట్టే బ్యాగ్ ధర రూ.55 గా నిర్ణయించినట్లు టీటీడీ వెల్లడించింది.
ఈ బ్యాగులు లడ్డూలోని నెయ్యి వంటి పదార్ధాలను పీల్చుకోవని, దీంతో లడ్డూలు ఎక్కువ కాలం ఉంటాయని టీటీడీ తెలిపింది. మోయడానికి చాలా తేలికగా ఉండటంతో భక్తులు కూడా ఈ బ్యాగులను వినియోగించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకంపై టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని భక్తులతో పాటు ప్రజలు స్వాగతిస్తున్నారు.