
కరోనా వైరస్ ఎప్పుడు, ఎలా అంటుకుంటుందో తెలియక జనాలు తలలు పట్టుకున్నారు. కాగా ఈ మహమ్మారి నుండి తమను తాము కాపాడుకోవాలని వైద్యులు, ప్రభుత్వాలు నెత్తినోరు మొత్తుకుంటున్నా, కొందరు మాత్రం అజాగ్రత్తను ప్రదర్శిస్తూ కరోనా బారిన పడుతున్నారు. కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో జనసంద్రం ఏర్పడే సామూహిక వేడుకలు, పార్టీలు, పెళ్లిళ్లకు ప్రభుత్వం నిషేధించింది. కొంతమంది సభ్యులతోనే ఈ వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.
అయితే ఇదేమీ లెక్కచేయకుండా ఓ పెళ్లి వేడుకలో ఏకంగా 500 మంది భోజనాలు చేశారు. దీంతో ఇప్పుడు ఆ ఊరి జనం మొత్తం కరోనా మహమ్మారితో వణికిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా కోటవురట్ల మండలం కొడవటిపూడికి చెందిన ఓ యువకుడికి పెళ్లి ఫిక్స్ అయ్యింది. కాగా అతడికి కరోనా లక్షణాలు కలగడంతో పరీక్ష కూడా చేయించుకున్నాడు. అయితే టెస్టు చేయించుకుని పది రోజులు అయినా రిజల్ట్ రాలేదు. దీంతో అతడు ఆగస్టు 15న పెళ్లి చేసుకున్నాడు. చర్చిలో జరిగిన ఈ వివాహ వేడుకకు 90 మంది హాజరుకాగా, భోజనాలకు ఏకంగా 500 మంది వరకు వచ్చారట.
కాగా ఆగస్టు 16న సదరు వ్యక్తి కరోనా రిపోర్టులో పాజిటివ్ అని తేలడంతో ఆ పెళ్లికి హాజరైన అందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వారంతో ఏం చేయాలో తెలీక తలలు పట్టుకుంటున్నారు. వెంటనే దగ్గరలోని కరోనా పరీక్షా కేంద్రానికి వెళ్లి వారికి కరోనా సోకిందేమే పరీక్షలు చేయించుకుంటున్నారట. దీంతో పెళ్లి మాట చెబితేనే ఆ గ్రామంలోని ప్రజలు లొల్లి చేస్తున్నారట. ఏదేమైనా ఇప్పట్లో ఆ గ్రామ ప్రజలు పెళ్లి అనే మాటను వినేందుకు కూడా ఒప్పుకోరని, ప్రభుత్వం చెప్పేది ప్రజల మంచికోసమేనని, దానిని కాదని తప్పులు చేస్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయని పలువురు అంటున్నారు.