సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత రాజమండ్రి రాజకీయ పరిణామాలు విచిత్రంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా కొనసాగినా.. రాజమండ్రిలో మాత్రం టీడీపీ నుంచి పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్ధిని ఆదిరెడ్డి భవాని 30వేలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు.
అయితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అధికారంలో లేకపోవడంతో రానున్న ఐదేళ్లపాటు నగర అభివృద్ధిపై ఇచ్చిన హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ఆదిరెడ్డి భవాని డైలమాలో పడ్డట్టు కనిపిస్తోంది. అయితే, నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలిగా, ఉత్తరాంధ్ర రాజకీయ దిగ్గజం ఎర్రం నాయుడు కుమార్తెగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆదిరెడ్డి భవాని తొలి ఎన్నికల్లోనే ఘన విజయం సొంతం చేసుకోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ అధికారంలో లేకపోవడంతో రానున్న ఐదేళ్లు ఆదిరెడ్డి ఫ్యామిలీ తమ ఉనికిని ఎలా చాటుకుంటారన్నది ప్రశ్నగా మారింది. ఓ వైపు ఎమ్మెల్యే పదవి ఉన్నా.. ఇకపై పనులు ఎలా చేయిస్తారన్నది ప్రశ్నగా మారింది. ఈ క్రమంలోనే రానున్న కార్పొరేషన్ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారు..? పార్టీ కేడర్‌ను ఏ మేరకు కాపాడుకుంటారు అన్న అయోమయం పార్టీలో కనిపిస్తోంది. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠం మరోసారి టీడీపీకి దక్కేలా చేయడానికి ఆదిరెడ్డి కుటుంబం వార్డుల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.