ఏపీ ఎన్నికల వార్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. వాటిలో గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం ఒకటి. తొలి నుంచి అది టీడీపీ కంచుకోటగానే కొనసాగుతూ వస్తోంది. ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూడా టీడీపీనే. ఈ సారి ధూళిపాళ్ల గెలిస్తే టీడీపీ ఖాతాలో మరో సారి పొన్నూరు వచ్చి చేరడంతోపాటు గుంటూరు రాజకీయాల్లో డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేగా ధూళిపాళ్ల కొత్త చరిత్రను సృష్టించిన నేతవుతారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి పొన్నూరులో ఎనిమిదిసార్లు ఎన్నికలు జరిగితే ఏడుసార్లు టీడీపీ గెలుపొందింది. 1994 నుంచి ఇప్పటి వరకు ధూళిపాళ్ల నరేంద్ర ఐదుసార్లు పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సారి ఎన్నికల్లోనూ ధూళిపాళ్ల ఎమ్మెల్యేగా గెలుపొందితే గుంటూరు జిల్లా నుంచి ఆరుసార్లు వరుసగా విజయాలు సాధించిన తొలి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అవుతారు.