భారత్ కు ఆపన్నహస్తం అందిస్తున్న దేశాలు

ఇంటర్నేషనల్ డెస్క్- భారత్ లో కరోనా విలయతాండవం చేస్తున్నవేల పలు దేశాలు సాయం చేయడానికి ముందుకొస్తున్నాయి. మన దేశానికి అండగా నిలవడానికి ముందుకొచ్చిన అమెరికా భారీ సాయాన్ని ప్రకటించింది. ఈమేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ ప్రకటన చేశారు. రెమ్డెసివిర్ సహా ప్రాణాలను కాపాడే ఔషధాలను, ఇతర వైద్య పరికరాలను పంపుతున్నట్టు ఆయన చెప్పారు. వ్యాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన యంత్రాల విడిభాగాలను పంపుతున్నట్టు బైడెన్ తెలిపారు. ఇక సింగపూర్ రెండు సి-130 విమానాల్లో ఆక్సిజన్ సిలిండర్లను భారత్కు పంపింది. బుధవారం ఉదయం ఈ సిలిండర్లలోడును సింగపూర్ విదేశాంగ మంత్రి మాలికి ఉస్మాన్ ఆ దేశంలోని భారతరాయబారి పి.కుమరన్కు అందజేశారు. గత ఏడాది తాము కష్టకాలంలో ఉన్నప్పుడు భారత్ తమకు చేసిన సాయాన్ని మాలికి గుర్తుచేసుకుని కృతజ్ఞతలు చెప్పారు. టాటా గ్రూపు సింగపూర్ నుంచి నాలుగు క్రయోజెనిక్ ఆక్సిజన్ సిలిండర్లను రప్పించింది. బ్రిటన్ కూడా 400 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, కీలకమైన వైద్యపరికరాలను గురువారం పంపుతున్నట్టు తెలిపింది. ఇప్పటికే బ్రిటన్ నుంచి 200 వెంటిలేటర్లు, 95 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను బ్రిటన్ భారత్కు పంపించింది.

అటు దక్షిణ కొరియా కూడా భారత్కు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, కరోనా డయాగ్నస్టిక్ కిట్లను, ఇతర వైద్యపరికరాలను అందజేసేందుకు ముందుకొచ్చింది. అమెరికా లోని యూఎస్ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ ఫౌండేషన్ భారత్కు 50 వెంటిలేటర్లను, ఇతర వైద్య పరికరాలను పంపుతోంది. మరోవైపు.. భారత్కు కోటి డాలర్ల సాయం రెడ్క్రాస్ ద్వారా అందజేయనున్నట్టు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ప్రకటించారు. భారత్కు సాయం చేయాలనుకుంటే రెడ్క్రాస్ వెబ్సైట్ ద్వారా చేయవచ్చని కెనడా ప్రజలకు పిలుపునిచ్చారు. స్విట్జర్లాండ్ కూడా భారత్కు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, వెంటిలేటర్లను, ఉపకరణాలను పంపడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. ఇలా భారత్ కు కష్టకాలంలో ప్రపంచ దేశాలన్నీ సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి.