సీఎం జగన్ బెయిల్ పై సర్వత్రా ఉత్కంఠ.. సీబీఐ కోర్టు ఏంచెప్పబోతోంది

హైదరాబాద్- ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జూన్ 1న సీబీఐ ప్రత్యేక కోర్టు జగన్ బెయిల్ రద్దుపై ఏం తీర్పు చెప్పబోతోందన్నదానిపై రెండు తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అక్రమాస్తుల కేసులో ఆరెస్ట్ అయిన వైఎస్ జగన్ 17 నేలల పాటు జైళ్లో ఉండి, ఆ తరువాత బెయిల్ పై బయటకు వచ్చారు. 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ విజయం సాధించండతో జగన్ మఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఐతే సీఎం వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ నర్సూపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

jagan

బెయిల్ పై జగన్ బయటకు వచ్చాక అక్రమాస్తుల కేసులో సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరిస్తున్నారని, బెయిల్‌ షరతులను ఉల్లంఘిస్తున్నారని తన పిటీషన్ లో పేర్కొన్నారు రఘురామ. న్యాయస్థానం ఇచ్చిన స్వేచ్ఛను జగన్ దుర్వినియోగం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పలువురు సాక్షులు జగన్‌ ప్రభుత్వంలో అధికారులుగా ఉండటం, కొందరు సహ నిందితులు కీలక పదవుల్లో కొనసాగడం వంటి అంశాలను పిటీషన్ లో ప్రస్తావించారు. ఒకరికి సలహాదారు పదవి ఇవ్వడం, విజయసాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు పంపడం లాంటివన్నీ పిటిషన్‌లో వివరించారు. ప్రజా ప్రతినిధుల కేసుల్లో విచారణ వేగవంతం చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను జీర్ణించుకోలేని వైసీపీ నేతలు న్యాయవ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని రఘురామ కృష్ణరాజు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఇక ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటీషన్ పై, సీఎం వైఎస్ జగన్‌ తోపాటు, సీబీఐ కూడా కౌంటర్‌ దాఖలు చేయాల్సి ఉంది. ఐతే ప్రస్తుతం కరోనా నేపధ్యంలో లాక్‌డౌన్‌ కోనసాగుతున్న పరిస్థితుల్లో జగన్‌ న్యాయవాది, ఉన్నతాధికారుల అభిప్రాయం తెలుసుకోవాలంటూ సీబీఐ లాయర్‌ కౌంటర్‌ వేయకుండా వాయిదా కోరారు. దీనిపై సీబీఐ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, జూన్‌ 1లోపు కౌంటర్‌ వేయకుంటే, తామే పిటిషన్‌పై నేరుగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ తరపు న్యాయవాది సన్నద్దమవుతున్నారు. మరి వచ్చే నెల 1న సీబీఐ కోర్టు ఈ కేసును విచారించాక ఎటువంటి తీర్పు చెబుతుందన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాల్సిన అవసరం లేదంటుందా. లేక రఘురామ కృష్ణరాజు కోరిన విధంగా జగన్ బెయిల్ ను రద్దు చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.