ట్విట్టర్, ఫేస్‌బుక్ బ్లాక్ కాబోతున్నాయా!?.

సోషల్ మీడియా దిగ్గజాలు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు మరో రెండు రోజుల్లో నిషేధిత జాబితాలోకి వెళ్లనున్నాయా అనే అనుమానాలు బలపడుతున్నాయి. మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిబంధలపై ట్విట్టర్, ఫేస్‌బుక్ యాజమాన్యాలు ఇప్పటికీ స్పందించకపోవడం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు నెలల గడువు మే 26తో ముగుస్తుండడంతో ఇక ఇండియాలో ఆయా సోషల్ మీడియా సంస్థలు తమ కార్యకలాపాల్ని కొనసాగించకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. ఒక సమాచారాన్ని తొలగించాలని ప్రభుత్వపరమైన లేదా చట్టబద్ధమైన ఆదేశాలిస్తే 36 గంటలు దాటకుండా దాన్ని పాటించాల్సిందే. ఏదైనా దర్యాప్తు లేదా సైబర్ సంబంధిత ఘటనలపై అడిగిన 72 గంటల్లోగా ఆయా సంస్థలు సహకారం అందించాలి. లైంగిక చర్యలకు సంబంధించిన సమాచారంపై ఫిర్యాదు అందిన రోజునే తప్పనిసరిగా స్పందించాలి.  మార్గదర్శకాల్లో సూచించిన విధంగా ఏర్పాట్లు చేసుకోవడానికి సామాజిక మాధ్యమాలకు, ఓటీటీలకు మే 25 దాకా కేంద్రం సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే.

facebook twitter icons

అలాగే వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి సోషల్‌ మీడియా సంస్థలు ఒక అధికారిని నియమించాలి. ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా అధికారి ఆ విషయా న్ని వారికి తెలియజేయాలి. 15 రోజుల్లోగా పరిష్కరించాలి. సోషల్‌ మీడియా సంస్థలు చట్టాలు, నిబంధనల ప్రకారం నడుచుకునేలా చూడడం కోసం ‘చీఫ్‌ కంప్లయన్స్‌ అధికారి’ని నియమించాలి. పోలీసులు, సీబీఐ వంటి లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలకు 24 గంటలూ అందుబాటులో ఉండే లా ‘నోడల్‌ కాంటాక్ట్‌ పర్సన్‌’ను నియమించాలి. ఫిర్యాదుల పరిష్కారాల కోసం రెసిడెంట్‌ గ్రీవన్స్‌ అధికారిని నియమించాలి. వీరంతా భారత్‌లో నివసించేవారై ఉండాలి. ఇలా ఎన్నో నిబంధనలను కేంద్రం విధించింది. కానీ  ఆ నిబంధనల ప్రకారం భారతదేశానికి చెందినఒక్క ‘కూ’ సంస్థ తప్ప మిగతా ప్రముఖ సామాజిక మాధ్యమాలు అలాంటి అధికారులను నియమించలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నిబంధనల అమలుకు ప్రభుత్వం మూడు నెలల సమయమివ్వగా.. ఆయా సంస్థలు మాత్రం ఆరు నెలల సమయం అడుగుతున్నాయి.