నెల్లూరు రూరల్- ప్రేమ.. ఇది ఒక్కోసారి ప్రాణాలు పోస్తుంది.. ఒక్కోసారి ప్రాణాలను తీస్తుంది. ఈ మధ్య కాలంలో ప్రేమించిన వారిని మోసం చేసే ఘటనలే ఎక్కువగా చూస్తున్నాం. లేదంటే ప్రేమించి అమ్మాయి తిరిగి ప్రేమించకపోతే ఆమెపై దాడికి పాల్పడే సంఘటనలూ జరుగుతున్నాయి. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం తాను ప్రేమించిన వాడు చనిపోతే, ఆ యువతి కూడా ప్రాణాలు తీసుకుంది.
నెల్లూరు జిల్లాలో ఉండ్రాళ్ల మండలం యల్లాయపాళెం మజరా గ్రామనత్తంకు చెందిన శ్రీకాంత్, అదే గ్రామానికి చెందిన సౌమ్యలు ప్రేమించుకున్నారు. అంతే కాదు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఇంట్లో విషయం చెప్పారు. ముందు ససేమిరా అన్న రెండు కుటుంబాలు, వీరిద్దరి పట్టుదల చూసి ఆఖరికి పెళ్లి చేసేందుకు ఓకే చేప్పారు.
ఐతే శ్రీకాంత్‌కు అన్న ఉండటంతో అతనికి పెళ్లి చేశాక, వీరిద్దరికి వివాహం చేస్తామని కుటుంబ సభ్యులు చెప్పారు. అందుకు ప్రేమికులు సైతం సరేనన్నారు. ఇలాంటి సమయంలో శ్రీకాంత్ ను మృత్యువు కబలించింది. పెళ్లిళ్లకు, పంక్షన్స్ కు ఎలక్ట్రికల్ డెకరేట్ చేసే పనిచేస్తున్న శ్రీకాంత్ శుక్రవారం ఆత్మకూరు దగ్గర డెకరేషన్స్ పని కోసం వెళ్లి విద్యుత్ షాక్‌తో చనిపోయాడు. తాను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన శ్రీకాంత్ చనిపోవడంతో సౌమ్య తట్టుకోలేకపోయింది.
తన ప్రియుడు లేని జీవితం ఇక అవసరం లేదని నిర్ణయించుకుంది సౌమ్య. శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉన్న పంటచేనుకు వాడే గుళికల మందు తాగేసింది. ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చూసిన కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఐతే అప్పటికే ఆమె చనిపోయినట్లు తేడాక్టర్లు చెప్పారు. దీంతో రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. శ్రీకాంత్, సౌమ్యల మృతదేహాలకు గ్రామంలో ఒకేచోట అంత్యక్రియలు నిర్వహించారు.