స్టాలిన్ నిర్ణయం సూపర్, తెలుగు సీఎంలు ఫాలో కావాలంటున్న జనం

చెన్నై (నేషనల్ డెస్క్)- దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజు వారి పనులు చేసుకుని జీవనం సాగింతే వారు కష్టాల్లో మునిగిపోయారు. వీటన్నింటిని గమనించిన ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు. నిరుపేదల సంక్షేమానికి సంబందించిన ఫైలుపైనే ఆయన తొలి సంతకం చేశాకు. రేషన్‌ కార్డుదారులకు కరోనా నివారణ నిధి కింద 4 వేలు అందిస్తామని స్టాలిన్‌ ఎన్నికల సమయంలో ప్రకటించిన మేరకు ఈ పథకాన్ని కరుణానిధి జయంతి రోజైన జూన్‌ 3వ తేదీ నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, కరోనా నిబంధనలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో ముందుగానే పంపిణీ చేయాలని సీఎం నిర్ణయించారు. అయితే ఆర్థిక స్థితిగతులపై అంచనాకు వచ్చేందుకు అనువుగా తొలి విడతగా ఈ నెలలోనే 2 వేల రూపాయలు ఇవ్వాలని సీఎం స్టాలిన్ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు ఆ ఫైలుపై తొలి సంతకం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని ఆర్డినరీ సిటీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేలా 2వ ఫైలుపై సంతకం పెట్టారు సీఎం స్టాలిన్.

ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోను వలస కార్మికులు, దినసరి కూళీలు, నిరుపేదలు కరోనా కష్టాలు ఎదుర్కొంటున్నారు. రోజు వారి పని లేక చాలా మంది పస్తులుంటున్నారు. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. దేశవ్యాప్తంగా కేంద్రం కాని, లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమిళనాడు ప్రభుత్వం మాదిరిగానే నెలకు కొంత డబ్బు సాయం చేస్తే సామాన్యులకు కాస్త ఉరట కలుగుతుందని అంటున్నారు. ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేషన్ కార్డు దారులకు తమిళ సర్కార్ లాగే నెలకు కొంత ఆర్ధిక సాయం చేసే అంశంపై ఆలోచించాలని జనం విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా మొదటి వేవ్ సమయంలో తెలంగాణ సర్కార్ ప్రతి కుటుంబానికి 1500 రూపాయల సాయం చేసింది. ఇప్పుడు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుని తమను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరి ఏమేరకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటారన్నదే ఆసక్తికరంగా మారింది.