బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు విచ్చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి హోదాలో ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర చేసిన బండి సంజయ్ తన యాత్రను శనివారం ముగించారు. దీనిని పురస్కరించుకుని, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేసిన అమిత్ షా… కేసీఆర్ సర్కారుపై ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలను సాధిస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్… ఆ హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే నీళ్లు, నిధులు, నియామకాల హామీలను నెరవేరుస్తామని ఆయన చెప్పారు.
బండి సంజయ్ సాగించిన పాదయాత్ర అధికారం కోసమో, ఒక పార్టీ నుంచి మరో పార్టీకి అధికార బదలాయింపు కోసమో కాదని అమిత్ షా చెప్పారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే బండి సంజయ్ పాదయాత్ర సాగిందన్నారు. నయా నిజాం ప్రభువు కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్ సర్కారును గద్దె దింపడమే మా లక్ష్యం అన్నారు. హైదరాబాద్ విముక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే సాధ్యమైందని అమిత్ షా చెప్పారు. తెలంగాణను కేసీఆర్ మరో బెంగాల్ లా మారుస్తారని ఆయన విమర్శించారు. తెలంగాణలో వారసత్వ రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయని అమిత్ షా ఆరోపించారు. కొడుకు, కూతురుకు అధికారం ఇచ్చిన కేసీఆర్ సర్పంచ్‌లకు మాత్రం అధికారం ఇవ్వలేదని విమర్శించారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని అన్నారు.
ఇది చదవండి: విషాదం.. దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి
రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనలేకపోతే తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల నుంచే నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తామని అమిత్ షా తెలిపారు. ఈ హామీని నిలబెట్టుకునే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని ఆయన చెప్పారు. కేసీఆర్ పాలనను సాగనంపేందుకు తెలంగాణ యువత సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే.. భారతదేశానికి సమగ్ర స్వరూపం ఏర్పడడానికి దోహదపడిన సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం.
ఇది చదవండి: Ketaki Chitale: శరద్ పవార్‌పై అనుచిత వ్యాఖ్యలు.. స్టార్ హీరోయిన్ అరెస్ట్!
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి తోడ్పడే పథకాలను.. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా సంపూర్ణంగా అమలు చేస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మతపరమైన రిజర్వేషన్లను రద్దుచేసి.. ఆ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు పంచుతామన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తాం. ఇది చెప్పడానికి, గుర్తు చేయడానికి నేను తెలంగాణకు వచ్చానని.. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చేందుకు ప్రజలు సహకరించాలి. తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఇంత ఘోరమైన పాలన కొనసాగిస్తున్నాని విమర్శించారు. కేసీఆర్ లాంటి అసమర్థ సీఎంను తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని కూడా ఆయన కీలక వ్యాఖ్య చేశారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.