నిర్ణయం మీరు తీసుకుంటారా.. మేం తీసుకోవాలా

హైదరాబాద్- తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ధర్మాసనం అసంతృప్తి చెందింది. ఈ రోజు రాత్రితో కర్ఫ్యూ ముగుస్తున్నా తదుపరి చర్యలు ప్రకటించకపోవడంపై కోర్టు మండిపడింది. కరోనా కట్టడికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో 45 నిమిషాల్లో చెప్పాలని అడ్వకేట్ జనరల్‌ను కోర్టు ఆదేశించింది. ఒకవేళ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రభుత్వం విధుల్లో జోక్యం చేసుకోవాలన్నది తమ ఉద్దేశం కాదని, కానీ ప్రభుత్వం పట్టించుకోనప్పుడు తామే కలగజేసుకుంటామని హైకోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఏప్రిల్ 30వ తేదీతో కర్ఫ్యూ ముగుస్తున్నందున తదుపరి తీసుకోబోతున్న చర్యలపై గురువారం హైకోర్టులో విచారణ జరిగిన సందర్బంగా అడ్వకేట్ జనరల్ అభ్యర్ధనపై విచారణను నేటికి వాయిదా వేసింది. అయినప్పటికీ ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలపై ఏజీ స్పష్టత ఇవ్వకపోవడంతో కోర్టు సీరియస్ అయింది. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అర్దం కావడం లేదని హాకోర్టు వ్యాఖ్యానించింది.