ముంబయిలో రాయిని ఢీకొట్టిన నౌక.. 270 మంది సిబ్బంది గల్లంతు

ముంబయి- ఓ వైపు కరోనా, మరో వైపు తుఫాను భారత్ ను అతలాకుతలం చేస్తున్నాయి. కరోనా ఇప్పటికే భీబత్సం సృష్టిస్తోంటే.. అది చాలదన్నట్లు తౌక్టే సైక్లోన్ ధూసుకొచ్చింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫానుకు మహారాష్ట్ర, గుజరాత్ సహా ఐదు రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తోంది. ఈ తుఫాను ప్రస్తుతం గుజరాత్ తీరం వైపు పయనిస్తోంది. మంగళవారం సాయంత్రం ఇది గుజరాత్ పోరుబందర్ మహూవా దగ్గర తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరం దాటే సమయంలో భారీ తుఫానుగానే రూపాంతరం చెందుతుందని ఐఎండీ హెచ్చరించింది. మంగళవారం రాత్రి 8 గంటలకు తుఫాను తీరం దాటనుండటంతో లోతట్టు ప్రాంతాల్లో నివసించే సుమారు లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాలతో ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

Ship

తౌక్టే తుఫాను ప్రభావంతో వీస్తున్న ప్రచండ గాలులకు ముంబయి తీరంలో ఓ వాణిజ్య నౌక రాయిని ఢీకొట్టింది. దీంతో నౌక లోని 270 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వీరి కోసం కోస్ట్‌గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఐఎన్ఎస్ కొచ్చి సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పెను గాలులు వీస్తుండటంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోందని అధికారులు చెప్పారు. తీరంలో ఆగి ఉన్న వాణిజ్య నౌక.. అతి వేగంగా వీచిన గాలులకు ఒక్క సారిగా ఊగిపోయిందట. తీరం నుంచి కొంత దూరం కొట్టుకుపోయిన నౌక.. దగ్గర్లోని భారీ రాయిని ఢీకొట్టింది. దీంతో నౌకలో సముద్రంలో అటూ ఇటూ ఊగిపోయింది. నౌకలో ఉన్న సుమారు 270 మంది సిబ్బంది సముద్రంలో పడిపోయి చెల్లా చెదురైపోయారు. వాళ్లలో కొంత మంది ఈదుకుంటూ తీరం ఒడ్డుకు వచ్చారని ప్రత్యక్ష్య సాక్షులు చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్ సిబ్బంది గల్లంతైన వారికోసం గాలింపు చేపట్టింది.