ఓ మహిళతో కలిసి మరో మహిళపై అత్యాచారం, హత్య

హైదరాబాద్- ప్రభుత్వాలు ఎన్ని పటిష్టమైన చట్టాలు చేసినా హత్యలు, అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. దేశంలో ప్రతి రోజు ఎక్కడో ఓ చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో మహిళలు బయటకు వెళ్లాలంటేనే వమికిపోతున్నారు. ఇదిగో ఇక్కడ ఓ వివాహిత మహిళను నమ్మించి తీసుకెళ్లి అత్యాచారం చేసి కిరాతకంగా చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దారుణం ఏంటంటే మరో మహిళ సహకారంతో ఆమెను రేప్ చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఒళ్లుగగుర్పొడిచే ఘోరాలు చెప్పినట్లు సమాచారం. ఆమె ఒక్కతే కాదని.. మరికొందరిని కూడా కోరిక తీర్చుకుని చంపేసినట్లు చెప్పడంతో పోలీసులే షాక్‌కి గురైనట్లు తెలుస్తోంది. నిందితుడు చెప్పిన వివరాల మేరకు మహిళ డెడ్‌బాడీని సంగారెడ్డి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Cops alert 1

హైదరాబాద్ శివారులోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిన్నారం మండలం మాదారం గ్రామానికి చెందిన 27 ఏళ్ల స్వామి అనే యువకుడు ఈ నెల 25న మల్లంపేటలోని కూలీ అడ్డా నుంచి 35 ఏళ్ల వివాహిత మహిళను పనికోసం తీసుకెళ్లాడు. ఐతే అప్పటి నుంచి ఆ మహిళ కనిపించకుండా పోవడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరో మహిళతో కలసి ఆమెను రేప్ చేశానని, అనంతరం ఆమెను హత్య చేసినట్లు హంతకుడు చెప్పాడు.

ఇక పోలీసులు విచారణలో నిందుతుడు ఒళ్లు జలదరించే విషయాలను వెల్లడించాడు. తాజాగా అత్యాచారం చేసిన మహిళనే కాకుండా, అంతకు ముందు కూడా మరో ముగ్గురు మహిళలను కూడా అలాగే అత్యాచారం చేసి, హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం మాదారం గుట్టల్లో మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.