తలైవా వస్తోంటే గాల్లోకి లేస్తున్న వాహనాలు, రజనీకాంత్ అన్నాత్తే టీజర్ అదుర్స్

ఫిల్మ్ డెస్క్- సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ సరైన హిట్ సినిమా కోసం చాలా కాలంగా ఎదురచూస్తున్నారు. ఐతే ఆయన సినిమాలు ప్లాప్ అయినా, ఆయన స్టైల్ కు అభిమానులు ఫిదా అవుతుంటారు. తాజాగా రజినీ కాంత్ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కిస్తోన్న అన్నాత్తే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శివ డైరెక్షన్ అంటేనే మాస్‌ మసాలాకు కొదవ ఉండదు.

మన తెలుగు డైరెక్టర్ అయిన శివ కోలీవుడ్ లో వరుస బ్లాక్ బాస్టర్స్ తో ఏ వెలుగు వెలుగుతున్నాడు. హీరో గోపీచంద్‌ తో శౌర్యం వంటి సినిమాలను తీసిన శివ అక్కడ వరుసగా అజిత్‌ తో బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు. విశ్వాసం, వీరం, వేదాళం, వివేగం అంటూ వరుస రికార్డులు బద్దలుకొడుతున్నాడు. ఇదిగో ఇప్పుడు తలైవా రజినీకాంత్‌ తో అన్నాత్తే మూవీతో అభిమానులను అలరించేందుకు వస్తున్నాడు శివ.

Annatha teaser 1

ఇప్పటికే రజనీ కాంత్ అన్నాత్తే మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లు అదుర్స్ అనిపించాయి. ఇప్పుడు దసరా కానుకగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. అన్నాత్తే టీజర్ గురువారం సాయంత్రం విడుదల చేశారు. ఈ టీజర్ లో తలైవా రజినీకాంత్‌ ను పీక్ లెవెల్‌లో చూపించారు. టీజర్ చూస్తోంటే మాస్ తో హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రంగా అన్నాత్తే రాబోతోన్నట్టు తెలుస్తోంది.

అన్నాత్తే టీజర్‌ లో రజినీ కాంత్ మినహా ఏ కారెక్టర్ కూడా కనిపించలేదు. యాక్షన్ సీక్వెన్స్‌ లతో ఔరా అనిపించారు. దీనికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాస్‌ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించేస్తోంది. టీజర్ చివర్లో రజినీకాంత్ ఒక్కో అడుగు వేస్తూ ఉంటే.. పక్కనే ఉన్న భారీ వాహనాలు బ్లాస్ట్ అవుతుంటాయి. రజినీకాంత్ లోని మాస్ యాంగిల్‌ ను పర్ఫెక్ట్ గా చూపించేసినట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అన్నాత్తే టీజర్ బాగా వైరల్ అవుతోంది.