యువర్ అటెన్షన్ ప్లీజ్ – విజయవాడ రైల్వేస్టేషన్‌ అమ్మకానికి సిద్ధంగా ఉన్నది.!!

దశాబ్దాల చరిత్ర కలిగిన విజయవాడ రైల్వే స్టేషన్‌ ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోతుందా ?   రైల్వేబోర్డు చేస్తున్న ప్రయత్నాలు విజయవాడ జంక్షన్ ఉసురుతీయబోతున్నాయా ? దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయడం ద్వారా ఆర్దిక వ్యవస్దను, తద్వారా స్దిరాస్ది రంగాన్ని పరుగులు తీయించాలన్న కేంద్రం ఆలోచనే ఇందుకు కారణమా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అదే జరిగితే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో రైల్వేస్టేషన్‌ ఎలా ఉండబోతోందో ఊహకు కూడా అందడం లేదు.  133 ఏళ్ల చరిత్ర గల విజయవాడ ఏ1 రైల్వేస్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. మానిటైజేషన్‌ పేరు పెట్టి, లీజుకు ఇస్తున్నట్టు చూపుతూ అనధికారిక విక్రయానికి తెర తీసింది. ఒక్క రైల్వేస్టేషనే కాదు.. విజయవాడ డివిజన్‌లో ఉన్న రైల్వే ఆస్తులను కూడా అందులో చేర్చింది. మరీ ముఖ్యంగా సత్యనారాయణపురం రైల్వే కాలనీని కూడా ఈ జాబితాలో చేర్చింది. డివిజన్‌ పరిధిలోని గూడ్స్‌ షెడ్లను గోడౌన్లుగా ఉపయోగించుకోవచ్చునని ప్రైవేటువారికి ఆఫర్‌ ఇచ్చింది.

Vijayawada Railway Station - Suman TVరైల్వే బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌  నేతలు ఇచ్చిన పిలుపుతో డివిజన్‌ పరిధిలోని కార్మికులు పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ మెరుపు ఆందోళనలకు దిగారు.  విజయవాడ రైల్వేకు నగరంలో అనేక విలువైన ఆస్తులున్నాయి. అలాంటి వాటిలో సత్యనారాయణపురంలోని రైల్వే కాలనీ ఒకటి. రైల్వే ఉద్యోగులకు ఇక్కడ గృహ సముదాయాన్ని నిర్మించారు. దాదాపు వెయ్యిమంది రైల్వే ఉద్యోగుల కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఈ నివాసాలకు ఆనుకుని మరో మూడెకరాల భూములు ఉన్నాయి. వీటన్నింటినీ రైల్వేబోర్డు ప్రైవేటు చేతుల్లో పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది.

రైల్వే ఆస్తుల మానిటైజేషన్‌ను విజయవాడ డివిజన్‌ వ్యాప్తంగా రైల్వే కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించారు. దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ (ఎస్‌సీఆర్‌ఎంయూ) ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడ రైల్వేస్టేషన్‌, రాయనపాడు వ్యాగన్‌ వర్క్‌షాప్‌, కోచింగ్‌ డిపోలు, డీజిల్‌, లోకో షెడ్లు, వర్క్‌షాప్‌లు ఇలా ప్రతి చోట వందలాది మంది కార్మికులు రైల్వే బోర్డు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మెరుపు ధర్నాలు నిర్వహించారు.  మానిటైజేషన్‌ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని, తమ నిర్ణయాన్ని రైల్వేబోర్డు దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.