సీఎం కేసీఆర్ కు రఘురామ లేఖ..వారిపై చర్యలు తీసుకోవాలని వినతి

న్యూ ఢిల్లీ-హైదరాబాద్- నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును రాజద్రోహం ఆరోపణల కింద అరెస్ట్ చేయడం, ఆ తరువాత సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడం వంటి పరిణామాలన్నీ తెలిసినవే. ప్రస్తుతం రఘురామ ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు. ఎంపీనైన తనను అరెస్టు చేసే సమయంలో పొరుగు రాష్ట్ర పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలను గచ్చిబౌలి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ పట్టించుకోలేదని ఆయన లేఖలో పేర్కోన్నారు. ఈ మేరకు ఆ పోలీసు అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేసీఆర్ కు రాసిన లేఖలో కోరారు రఘురామ కృష్ణరాజు. చాలా సందర్భాల్లో ఇటివంటి కేసుల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులు, పోలీసు మాన్యువల్‌ చెబుతున్న మార్గదర్శకాలను లేఖలో ప్రస్తావించారు.

kcr

ఈనెల 14న తన అరెస్టు సమయంలో చోటుచేసుకున్న నిబంధనల ఉల్లంఘనలను తెలియజేస్తూ కేసీఆర్‌కు 8 పేజీల లేఖ రాశారు రఘురామ. తనపై ఏపీ సీఐడీ సూమోటోగా కేసు నమోదు చేసిందని, ఈ కేసును గుంటూరు సీఐడీ అడిషనల్‌ ఎస్పీ విజయపాల్‌ నేతృత్వంలో పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ నెల 14వ తేదీన హైదరాబాద్‌ గచ్చిబౌలి బౌల్డర్‌ హిల్స్‌లోని తన నివాసమైన 74వ నంబర్‌ విల్లాకు ఒక బృందం వచ్చిందని చెప్పారు. ఐతే తనను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసేందుకు వచ్చినప్పుడు గచ్చిబౌలి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ కనీస పోలీసు నిబంధనలను పట్టించుకోలేదని లేఖలో ఆరోపించారు. ఎంపీగా ఉన్న తన అరెస్టుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని కూడా పరిశీలించలేదని ఆవేధన వ్యక్తం చేశారు. ఏపీ సీఐడీ నుంచి ట్రాన్సిట్‌ రిమాండ్‌ ఆర్డరు తీసుకోలేదని, కనీసం ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఉందో లేదో కూడా పట్టించుకోలేదని రఘురామ సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో చెప్పుకొచ్చారు.

ఏపీ సీఐడీ తనను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యతనూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ విస్మరించారని అన్నారు. తనను కారులోకి బలవంతంగా నెట్టేస్తున్నా గచ్చిబౌలి ఎస్‌హెచ్‌ఓ స్పందించలేదని ఆరోపించారు. తనను అరెస్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దును దాటేముందు ప్రస్తుతమున్న నిబంధనలు, మార్గదర్శకాల మేరకు తెలంగాణ ప్రభుత్వ అనుమతిని ఏపీ సీఐడీ తీసుకోలేదని గుర్తు చేశారు రఘురామ. తెలంగాణ పోలీసులు రూల్‌ ఆఫ్‌ లాను అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ కు రాసిన లేఖలో రఘురామ కృష్ణరాజు కోరారు. మరి రఘురామ లేఖపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నదే ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.