కాలేజీకి వెళ్తుండగా ఆమెను అడ్డగించి అసభ్యంగా.. సరిగ్గా ఏడేళ్ల తరువాత

స్పెషల్ డెస్క్- తప్పు చేసినవాడికి తప్పకుండా శిక్ష పడుతుందని చెబుతుంటారు. అలా అని అందంరూ శిక్ష అనుభవించరు. కొంత మంది తప్పుచేసి కూడా చట్టం నుంచి తప్పించుకుంటే, మరి కొంత మందికి మాత్రం నిజంగానే శిక్ష పడకతప్పదని చాలా సందర్బాల్లో తేలింది. ఇదిగో ఓ అమ్మాయి విషయంలో అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తికి ఏడేళ్ల తరువాత కోర్టు శిక్ష విధించింది.

ఈ ఘటన గురించి పూర్తిగా తెలియాలంటే మనం 2015లో జరిగిన ఘటన గురించి తెలుసుకోవాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన 20 ఏళ్ల స్రవంతి 2015 జనవరి 17న ఫీజు చెల్లించేందుకు కాలేజీకి వెళ్తుండగా అదే మండలం వీరాపురానికి చెందిన కుమ్మరి రామకృష్ణ అనే యువకుడు ఆమెను దారిలో అడ్డగించాడు. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేశాడు.

Khammam

అంతే కాదు స్రవంతి సెల్‌ ఫోన్‌ లాక్కొని, ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. తన ప్రేమను అంగికరించకపోతే చంపేస్తానని బెదిరించాడు కుమ్మరి రామకృష్ణ. ఈ ఘటనతో తీవ్ర మనస్థాపం చెందిన స్రవంతి పురుగుల మందు తాగింది. సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి తిరిగొచ్చిన స్రవంతి రాత్రి వాంతులు చేసుకుంటుండగా తల్లి దమయంతి గమనించి ఏంజరిగిందని ప్రశ్నించింది. కాలేజీకి వెళ్తుండగా కుమ్మరి రామకృష్ణ తనతో ప్రవర్తించిన తీరుతో పురుగుల మందు తాగానని చెప్పింది.

దీంతో వెంటనే కుటుంబ సభ్యులు స్రవంతిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయింది. స్రవంతి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. న్యాయమూర్తి సాక్షులను విచారించగా రామకృష్ణ పై నేరం రుజువైంది. శుక్రవారం కొత్తగూడెం అదనపు సెషన్స్‌ జడ్జి జి.శ్రీనివాస్‌ శుక్రవారం తుది తీర్పు వెలువరించారు. ప్రేమ పేరుతో వేధించిన డిగ్రీ విద్యార్థిని స్రవంతి ఆత్మహత్యకు కారణమైన కుమ్మరి రామకృష్ణకు న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా విధించింది.