పోలీసులకు తమ “పవర్” చూపించిన కరెంటోళ్లు! దెబ్బకి దెబ్బ !

లాక్ డౌన్ లో పోలీసులు ప్రాణాలకి తెగించి విధులు నిర్వహిస్తున్నారు. ఫ్రెంట్ లైన్ వారియర్స్ గా వారి సేవలు ఎంత గొప్పవో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే.., ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. కొన్నిప్రాంతాల్లో మాత్రం పోలీసులు తమ లాఠీకి పని చెప్తున్నారు. ఎమర్జెన్సీ అయ్యి.. బయటకి వచ్చిన వారిని కూడా వాతలు తేలేలా కొడుతున్నారు. తాము ఎందుకు బయటకి వచ్చామో కారణం చెప్పే లోపలే పోలీసులు మీద పడి కొట్టేస్తున్నారు. ఇక కొన్ని జిల్లా కేంద్రాలలో కూడా ఇదే పరిస్థితి. తమ దగ్గర పాస్ ఉంది అని చూపించినా వారిని కూడా ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. ఇక ఇదంతా ఒక ఎత్తైతే.., ఎమర్జెన్సీ స్టాఫ్ పై కూడా పోలీసులు లాఠీలతో దాడి చేస్తుండటం విమర్శలకు కారణం అవుతోంది. మెడికల్, మీడియా, ఫుడ్, బాంక్స్, విద్యుత్ వంటి కొన్ని రంగాల వారికి లాక్ డౌన్ నుండి మినహాయింపు ఉంది. వారు బయటకి వచ్చి విధులు నిర్వహించకపోతే ప్రజా జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. ఈ కారణంగానే ప్రభుత్వం వీరందరికీ పర్మిషన్ ఇచ్చింది. కానీ.., నల్గొండ పోలీసులు ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. వీరు రోడ్లపైకి వచ్చిన ఎమెర్జెన్సీ స్టాఫ్ వాహనాలను అడ్డుకున్నారు. రోడ్డుపై కనపడిన వారిని కనపడినట్లు లాఠీలతో కొట్టారు. ఈ నేపథ్యంలో ఓ విద్యుత్ ఉద్యోగిపై దాడి చేయటంతో ఆ సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

current 2విపత్కర పరిస్థితుల్లో అత్యవసర సేవలు అందజేస్తున్న విద్యుత్ ఉద్యోగులను ఎలా కొడతారని వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా విద్యుత్ శాఖ ఉద్యోగులు పట్టణంలో కరెంటు సరఫరా నిలిపివేశారు. అంతే కాదు.., వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్స్ కి సైతం పవర్ కట్ చేశారు. ఎంత సేపటికీ కరెంట్ రాకపోవడంతో ఏమైందో తెలుకున్న పోలీసులకు షాక్ తిన్నంత పని అయ్యింది. దీంతో.., సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కేవీ రంగనాథ్.. విద్యుత్ ఎస్సీ కృష్ణయ్యతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. దీంతో.. మధ్యాహ్నం సుమారు 2గంటలకు విద్యుత్ పునరుద్ధరించారు. ఈ మొత్తం వ్యవహారం మంత్రి జగదీశ్రెడ్డి దృష్టికి వెళ్లడంతో విద్యుత్ ఉద్యోగులకు పాస్ ఇచ్చే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మూడున్నర గంటల పాటు విద్యుత్ లేకపోవడంతో పోలీసులకు చుక్కలు కనిపించాయి. ఈ వ్యవహారంలో దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ సమాధానమిచ్చారు. అయితే తాము పోలీస్ ఠాణాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేయలేదని.. బ్రేక్ డౌన్ అయినందునే ఇబ్బంది తలెత్తిందని ట్రాన్స్కో డీఈ చెప్పడం గమనార్హం. ఏదేమైనా విద్యుత్ ఉద్యోగుల చేసిన ఈ పనికి ప్రజల నుండి మద్దతు లభిస్తుండటం విశేషం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.