ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రద్దుపై హైకోర్టు తీర్పుని స్వాగతించిన జనసేనాని!..

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ లేదని హైకోర్టు పేర్కొంది. పోలింగ్‌కు  నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న నిబంధన పాటించలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏప్రిల్ 1న ఆంధ్రప్రదేశ్ నూతన ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ అదే రోజు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియకు నాలుగు వారాల సమయం ఉండాలని సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఇవ్వగా ప్రభుత్వం మాత్రం కేవలం ఎనిమిది రోజుల్లోనే ముగించింది. దీనిపైనే జనసేన పార్టీ అభ్యంతరం తెలుపుతూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో, హైకోర్టును జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు.

71 719917 pavan kalyan janasena latestఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పు హర్షణీయమని పవన్ అన్నారు. స్థానిక స్వపరిపాలనకు ఈ తీర్పు ఊపిరిపోసిందని చెప్పారు. ఏడాది క్రితం నోటిఫికేషన్ జారీ చేసి, ఆ తర్వాత కరోనా కారణంగా ఎన్నికలను రద్దు చేశారని తెలిపారు. అయితే అదే నోటిఫికేషన్ పై ఏడాది తర్వాత ఎన్నికలను నిర్వహించడం అంటే ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కినట్టేననని అన్నారు. ఏప్రిల్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం తలపెట్టినప్పుడే జనసేన తీవ్రంగా వ్యతిరేకించిందని పవన్ చెప్పారు. ఎన్నికలను రద్దు చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని ప్రజాస్వామ్య విజయంగా భావిస్తున్నామని తెలిపారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం పంతాలకు, పట్టింపులకు పోకుండా తగిన సమయంలో నోటిఫికేషన్ జారీ చేసి, ఎన్నికలను నిర్వహించాలని కోరుతున్నామని అన్నారు.