హిందూపురం ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక రోగులు మృతి!..

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది. ఈ క్రమంలో ఆక్సిజన్ కొరతతో చాలామంది రోగులు మృత్యువాతపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల గుంటూరు, విజయనగరం ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక పలువురు రోగులు మరణించిన సంగతి తెలిసిందే.

ఈ ఘటన మరచిపోక ముందే తాజాగా అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో ఎనిమిది మంది కరోనా రోగులు మరణించారు. అయితే వీరంతా ఆక్సిజన్ అందకనే మరణించారని మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ అందక రోగులు మృతి చెందడంపై టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ అందక రోగులు మృతి చెందడం బాధాకరమని ఆమె అన్నారు. ఆక్సిజన్ అందించలేని స్థితిలో ఉన్న సీఎం జగన్ కు అధికారంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. రెండు రోజుల వ్యవధిలో హిందూపురం ఆసుపత్రిలో 12 మంది చనిపోయారని మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.