నూతన సాగు చట్టాల రద్దు అంశంపై కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన కంగనా రనౌత్‌..

kangana ranaut

ప్రతి అంశంపై తనదైన శైలిలో స్పందిస్తుంటుంది బీటౌన్‌ సుందరి కంగనా రనౌత్‌. దాదాపు ఆవిడ ఏ అంశం మీద మాట్లాడినా అవి కాంట్రవర్సీ అవ్వాల్సిందే. తాజాగా కంగనా కేంద్రాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారమే రేపుతున్నాయి. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఒక కామెంట్‌ను షేర్‌ చేస్తూ ఇన్‌ స్టా వేదికగా మరో వివాదానికి తెరలేపింది. సాగు చట్టాల రద్దు నిర్ణయం పూర్తిగా అన్యాయమంటూ కామెంట్‌ చేసింది.

గురునానక్‌ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆ సందర్భంగా నూతన సాగు చట్టాలను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని ప్రతి పక్షాలు, రైతు సంఘాలు, నిరసనకారులు అందరూ స్వాగతించారు. కానీ కంగనా రనౌత్‌ మాత్రం అందుకు భిన్నంగా స్పందించింది. పోరాటాల ఫలితం ఏంటో నిరూపించిన సందర్భం ఇది అని ఉన్న ఒక కామెంట్‌ను కోట్‌ చేస్తూ కంగనా స్పందించింది. ‘సిగ్గుచేటు, విచారకరం, అన్యాయం.. పార్లమెంట్‌ లో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కాకుండా.. వీధి పోరాటాలు చేస్తున్న వ్యక్తులు చట్టాలు చేయడం మొదలు పెడితే ఇది జిహాదీ దేశమే అవుతుంది.. అలా కోరుకునే వారందరికీ అభినందనలు’ అంటూ కంగనా కామెంట్‌ చేసింది.

kangana ranautకంగనా రనౌత్‌ కామెంట్‌ కాస్త కాదు.. చాలానే అభ్యంతరకరంగా ఉన్నాయి. ఇటీవల స్వాతంత్ర్యం గురించి కామెంట్‌ చేసి కాంట్రవర్సీ క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ అంశం ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష, మిత్రపక్షాలు సమర్థిస్తున్నాయి, స్వాగతిస్తున్నాయి. సాగు చట్టాల రద్దు నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.