ఆస్పత్రి పడకల విషయంలో పురోగతి ‘పడకే’సిందా?

కొవిడ్‌ కేసుల తీవ్రతతో ఆసుపత్రుల్లో పడకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెరుగుతున్న పాజిటివ్‌ రోగులకు తగ్గట్లుగా పడకలు అందుబాటులో తీసుకురావటం అధికారులకు సవాలుగా మారింది. కొత్త రోగులకు పడకలు దొరక్కపోవడం డిశ్ఛార్జులు తక్కువగా ఉండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కోలుకున్నా కొందరు ఆస్పత్రులను వీడి బయటకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని అధికారులు చెబుతున్నారు. అలాంటి వారు వెంటనే ఇళ్లకు వెళ్లాలని, అత్యవసరమైన వారికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. పెరుగుతున్న రోగులను తట్టుకునేలా ప్రత్యామ్నాయ విధానాలతోపాటు డిశ్ఛార్జులపై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు.

కరోనా రెండో విడతలో ఎక్కువమంది శ్వాస సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఆక్సిజన్‌ అవసరమవుతోంది. ఇక ఆలస్యంగా వస్తున్న వారు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతూ, కొవిడ్‌ బారిన పడిన వారి పరిస్థితి త్వరగా విషమిస్తోంది. అలాంటి వారిని అత్యవసర వైద్య విభాగంలో ఉంచి చికిత్స అందించాలి. అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్నవారికి వెంటిలేటర్‌ అవసరం. 

ఆసపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా నిండుకుంటోంది. కరోనా రోగుల బంధువులు ఎలాగైనా ఆక్సిజన్ సంపాదించాలని తాపత్రయపడుతున్నారు. తమ కుటుంబ సభ్యులను బతికించమని డాక్టర్లను ప్రాధేయపడుతున్నారు. ఆస్పత్రుల బయట “పడకలు అందుబాటులో లేవు” అని బోర్డులు తగిలిస్తున్నారు.