రాష్ట్రంలో నేటి నుంచే మూడో డోసు.. ముందుగా వీరికే బూస్టర్ డోసు..

3rd Vaccination Starts in India

కరోనా మహమ్మారి అంతకంతకీ విజృభిస్తున్న విషయం తెలిసిందే. రోజుల వ్వవధిలోనే వందల్లో ఉన్న కేసులు.. వేలల్లోకి వచ్చేశాయి. ఏ మాత్రం అశ్రద్ధగా ఉండొద్దని WHO హెచ్చరిస్తోంది. కేంద్రం కూడా కట్టడి చర్యలు మొదలు పెట్టింది. రాష్ట్రాలు సైతం కరోనా కట్టడికి ఆంక్షలను కఠినతరం చేశారు. ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడికి బూస్టర్‌ డోసు టీకా పంపిణీ కూడా మొదలు పెట్టేశారు. జనవరి 10 నుంచి బూస్టర్‌ డోసు పంపిణీ మొదలు పెట్టారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది.

మొదట వైద్యారోగ్య, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి బూస్టర్‌ డోసు ఇవ్వనున్నారు. ఈ డోసు కోసం మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలియజేశారు. కొవిన్‌ పోర్టల్‌ లో స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. లేదా నేరుగా టీకా కేంద్రానికి వెళ్లి స్టాల్‌ బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. అయితే బూస్టర్‌ డోసుకు మిక్సింగ్‌ వ్యాక్సినేషన్‌ అవకాశం ఉండదని స్పష్టం చేశారు. మొదట రెండు డోసులు ఏ టీకా అయితే తీసుకున్నారో.. మూడో డోసు కూడా అదే టీకా వేస్తారని తెలిపారు. రెండో డోసు తీసుకున్న 9 నెలలు లేదా 36 వారాల తర్వాత బూస్టర్‌ డోసు టీకా తీసుకోవచ్చు.

ఇప్పటికే అర్హులందరికీ బూస్టర్‌/ప్రికాషనరీ డోసు టీకా విషయమై మెసేజ్‌ లు పంపినట్లు తెలియజేశారు. కేంద్రం అంచనాల ప్రకారం.. 1.9 కోట్ల ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, 1.05 కోట్ల ఆరోగ్య కార్యకర్తలు, 2.75 కోట్ల సీనియర్‌ సిటిజన్లు ఈ బూస్టర్‌ డోసు టీకా పొందనున్నారు. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపూర్‌, గోవా రాష్ట్రాల్లో ఇంకో నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందిని కూడా ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లుగా భావించాలని ఎన్నికల సంఘం సూచించింది. వారికి కూడా జనవరి 10 నుంచి బూస్టర్‌ డోసు టీకా ఇవ్వనున్నారు.