పార్లమెంట్ శీతకాల సమావేశంల్లో క్రిప్టో కరెన్సీ నియంత్రణ బిల్లు!

cryptocurrency

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళనకు అనుగుణంగా దేశంలో ప్రైవేట్ క్రిప్టో కరెన్సీల నిషేధానికి కేంద్రం మొగ్గు చూపుతన్నట్లు తెలుస్తోంది. రానున్న పార్లమెంట్ శీతకాల సమావేశంలో అత్యంత కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ శీతకాల సమావేశాల్లో “ద క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్- 2021 ” పేరిట ప్రవేశపెట్టనుంది కేంద్రం. దీని ప్రకారం ఆర్బీఐ పరిధిలోకి అధికారిక సొంత కరెన్సీ రానుంది. భారత్ లో మిగిలిన అన్ని ప్రైవేటు డిజిటల్ కరెన్సీలను నిషేధించనున్నారు.

ఆస్ట్రేలియా వేదికగా ఇటీవల జరిగిన ‘ది సిడ్నీ డైలాగ్’ సదస్సులో  వర్చువల్‌ గా పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ ‘ఇండియా టెక్నాలజీ: ఎవల్యూషన్ అండ్ రివల్యూషన్’ అనే అంశంపై కీలక ప్రసంగం చేశారు. ఆ వర్చువల్ మీటింగ్ లో  ప్రధాని క్రిప్టో కరెన్సీకి సంబంధించి మొదటిసారి మాట్లాడిన విషయం తెలిసిందే. చెడ్డవారి చేతుల్లోకి క్రిప్టో కరెన్సీ వెళ్లకుండా ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాలు కలిసి ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముందన్నారు. క్రిప్టో కరెన్సీని ఆపలేమని, అయితే నియంత్రించాల్సిన అవసరముందని ప్రధాని తెలిపారు.

ఆ సమావేశంలో ప్రధాని చెప్పిన మాటలకు అనుగుణంగా క్రిప్టో కరెన్సీ పై మన పార్లమెంట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. రానున్న పార్లమెంట్ శీతకాల సమావేశంలో మొత్తం 26 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా క్రిప్టో కరెన్సీ నియంత్రణ బిల్లును ఆమోదించనున్నారు. దీనితో పాటు రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించిన బిల్లుపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

నవంబర్ 16న కేంద్ర మాజీ మంత్రి జయంత్ సిన్హా నేతృత్వంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్, బ్లాక్ చైన్‌, క్రిప్టో కరెన్సీ అసెట్స్ కౌనిల్స్, పరిశ్రమల నిపుణులతో సమావేశం జరిగింది. క్రిప్టో కరెన్సీని ఆపకూడదని.. అయితే కచ్చితంగా నియంత్రించాలని సమావేశంలో సభ్యులు అభిప్రాయపడ్డారు.