హత్య చేసాయని ఏనుగుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు!..

అస్సాం రాష్ట్రం గోలాఘాట్ జిల్లాలో ఓ విచిత్రమైన కేసు ఎదురైంది. అక్కడి పోలీసులు ఓ ఏనుగును దాని పిల్లను అరెస్టు చేశారు. అరెస్టు చేయడమే కాదు, ఒక నేరస్తుడికి బేడీలు ఎలా అయితే వేస్తారో, ఈ ఏనుగులకు కూడా బేడీల రూపంలో ఇనుప గొలుసులతో కట్టేశారు. మనిషి అయితే స్టేషన్‌లోని సెల్‌లో వేస్తారు. కానీ ఇవి భారీ శరీరం ఉన్న గజరాజులు కావడంతో స్టేషన్ బయటే కట్టిపడేశారు.   ఆ పై సెక్షన్ 304కింద కేసు నమోదు చేశారు.

elephants arrested minనేరం చేసిన వారెవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని చట్టం చెబుతోంది. అయితే మూగజీవాలు నేరం చేస్తే పరిస్థితేంటి..? వాటికి శిక్ష వేస్తారా అనేదానిపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు.   ఈ ఏనుగులు గత వారం ఓ 14 ఏళ్ల బాలుడిని చంపేశాయి. తల్లి ఏనుగుతో పాటు పిల్ల ఏనుగుకు కూడా ఈ నేరంతో సంబంధం ఉందని అధికారులు తేల్చేయడంతో తల్లితో పాటు పిల్ల ఏనుగును కూడా అరెస్టు చేశారు.

ఈ ఏనుగులను బొకఖాత్ నియోజకవర్గం ఎమ్మెల్యే జితేన్ గొగోయ్ పెంచుకుంటున్నాడు. తల్లి ఏనుగు పేరు దులుమోని. చిన్నారి మృతి చెందడంతో  ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ పెంపుడు ఏనుగుల వల్ల తాము చాలా భయాందోళనకు గురవుతున్నామని స్థానికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

అనంతరం ఈ రెండు ఏనుగులను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఇదిలా ఉంటే ఏనుగు పిల్ల చాలా ముద్దుగా ఉండటంతో దాన్ని కౌగలించుకోవాలని రాగా తల్లి ఏనుగు బాలుడిపై దాడి చేసిందని అటవీశాఖ సిబ్బంది చెప్పారు. ముందు ముందు ఏం జరుగుతుందో కానీ, ప్రస్తుతం ఇది వైరల్ అయ్యింది.