కుగ్రామం నుంచి కుబేరుడి స్థానానికి ఎదిగిన జే చౌదరీ

jay chaudhary

అమెరికా ఎంతో మంది ఔత్సాహికుల కలల ప్రపంచం. అగ్రరాజ్యంలో పెద్ద కంపెనీలో ఉద్యోగం సాధించాలి.. ఇది ఎంతో మంది భారతీయుల స్వప్నం. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా అమెరికాలోనే కంపెనీలు స్థాపించే స్థాయికి ఎదిగారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 కంపెనీలను ఏర్పాటు చేసి అత్యంత ధనంతువల జాబితాలో చేరారు. మహర్షి సినిమాలో మహేష్ బాబు నిరుపేద కుటుంబంలో జన్మించి.. కష్టపడి చదివి అమెరికాలో సాఫ్ట్‌ వేర్ కంపెనీ స్థాపించే స్థాయికి ఎదుగుతాడు. అది సినిమాలో హీరో.. కానీ నిజ జీవితంలోనూ అలాంటి వ్యక్తి ఒకరు ఉన్నారని మీకు తెలుసా.? అతనే 62 ఏళ్ల జే చౌదరి.

తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో 16.3 బిలియన్ డాలర్ల ఆస్తితో అమెరికాలోని 400 మంది అత్యంత ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. దీని వెనుక ఎన్నో ఏళ్ల కృషి ఉంది. హిమాచల్ ప్రదేశ్‌ లోని ఓ కుగ్రామంలో నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన చౌదరి ఈ స్థాయికి ఎదిగారు. చౌదరీ జన్మించిన నాటికి వారి ఇంట్లో కనీసం కరెంట్ కూడా లేదు. దీంతో ఆయన ఇంటి బయట చదువుకునే వాడు. జీవితంలో ఎదురైన సమస్యలను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. కష్టపడి చదివి ఐఐటీ వారణాసిలో సీటు సాధించారు. వారణాసిలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌ లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం 1980లో అమెరికాలో కంప్యూటర్ ఇంజనీరింగ్‌ లో MSతోపాటు, మార్కెటింగ్‌ లో ఎంబీఏను పూర్తి చేశారు. చదువు పూర్తి చేసుకోగానే చౌదరీకి ఐబీఎంలో ఉద్యోగం వచ్చింది. ఇతర సాఫ్ట్‌ వేర్ కంపెనీల్లో 25 ఏళ్లపాటు పనిచేశారు. అనంతరం 1996లో అతని భార్య జ్యోతితో కలిసి ఓ చిన్న స్టార్టప్‌ను ప్రారంభించాడు.

అలా ఒక్క కంపెనీతో మొదలైన చౌదరీ వ్యాపారం ఐదు కంపెనీలకు విస్తరించింది. ఎయిర్ డిఫెన్స్, సిఫర్ ట్రస్ట్, కోర్ హార్బర్, సెక్యూర్ ఐటీ వంటి కంపెనీలను విజయవంతంగా ఏర్పాటు చేశారు. క్లౌడ్ టెక్నాలజీతో నడిచే జెడ్ స్కేలర్ కంపెనీ చౌదరీని ఒక అత్యంత ధనవంతుడిగా మార్చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చౌదరీ.. “నేను జెడ్ స్కేలర్ కంపెనీని ప్రారంభించే సమయంలో మార్కెట్ క్లౌడ్ టెక్నాలజీకి సిద్ధంగా లేదు. మొదట్లో క్లౌడ్ టెక్నాలజీకి చాలా సమయం, డబ్బు ఖర్చయింది. కానీ ప్రస్తుతం ఈ రంగంలో మేమే మొదటి స్థానంలో ఉన్నాం” అని చెప్పుకొచ్చారు. చౌదరీ స్థాపించిన కంపెనీల ద్వారా లక్షల కోట్లను ఆర్జించారు. ఇలా భారత్‌ లోని ఓ కుగ్రామంలో మొదలైన చౌదరీ ప్రస్థానం ఎందరో యువకులకు ఆదర్శం. చౌదరీ జీవిత ప్రయాణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.