మెక్సికోలో ఘోర ప్రమాదం- కూలిన మెట్రో ఫ్లైఓవర్‌!..

మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది.  మెట్రో వంతెన కూలి బోగీలు కిందపడి 15 మంది చనిపోయిన ఘటన మెక్సికో‌ రాజధానిలో చోటుచేసుకుంది. మెక్సికో సిటీలో జరిగిన ఈ ప్రమాదంలో మరో 70 మందికి గాయాలుకాగా వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వైద్యులు తెలిపారు. వంతెన కూలిపోవడంతో దాని కింద నుంచి వెళ్తోన్న కార్లపై మెట్రో బోగీలు పడ్డాయి. దీంతో భారీ సంఖ్యలో జనం గాయపడ్డారు.

స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే మెక్సికో నగర మేయర్ క్లాడియా షైన్బమ్ అక్కడకు చేరుకున్నారు. ‘‘అగ్నిమాపక సిబ్బంది, ప్రజా సంరక్షణ అధికారులు ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం వివిధ ఆస్పత్రులకు తరలించారు. కాసేపట్లో పూర్తి వివరాలను వెల్లడిస్తాం’’ అని మేయర్ ట్వీట్ చేశారు.