5వ తేదీ ప్రమాణస్వీకారానికి ముహుర్తం: మమతాదీదీ

టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. సోమవారం (ఇవాళ) తృణమూల్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే మమతను శాసనసభా పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఈ నెల 5 న ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేస్తారని తృణమూల్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రమాఫ స్వీకార మహోత్సవాన్ని అత్యంత సాధారణంగానే జరుపుతామని ప్రకటించారు. కరోనాను కట్టడి చేయడమే తమ ప్రథమ కర్తవ్యమని, దానిని కట్టడి చేసేంత వరకూ ఎలాంటి ఉత్సవాలూ జరపమని టీఎంసీ పేర్కొంది. 

తాను ఎన్నికల్లో గెలిచిన ప్రతీసారి ఫోన్ చేసి మరీ అభినందనలు తెలియజేసే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఈసారి మాత్రం ఫోన్ చేయలేదని పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ అన్నారు. వాస్తవానికి ఆదివారం ఐదు అసెంబ్లీల ఫలితాలపై ఓ క్లారిటీ వచ్చిన అనంతరమే గెలిచిన పార్టీ అధినేతలకు ట్విట్టర్ ద్వారా మోదీ అభినందనలు తెలియజేశారు.

‘‘నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి అభినందనలు తెలియజేయలేదు. ప్రతిసారి చెప్పేవారు. ఈసారి చెప్పలేదు. ఇలా జరగడం ఇదే మొదటిసారి’’ అని సోమవారం(ఇవాళ) పార్టీ కార్యకర్తల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ మమత చెప్పారు.