ఐపీఎల్‌కు కరోనా ఎఫెక్ట్ – సీజన్ వాయిదా?..

2020 ఐపీఎల్ సుదీర్ఘంగా వాయిదా పడి చివరికి దుబాయ్‌లో జరిగింది. కానీ ఈసారి 2021 ఐపీఎల్ సీజన్‌ను ఎలాగైనా ఇండియాలోనే నిర్వహించాలని భావించిన ఐపీఎల్ యాజమాన్యం జాగ్రత్తలతో స్టేడియంలను ఎంపిక చేసి ఆడియెన్స్ లేకుండానే మ్యాచులను నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభమైన 14వ సీజన్ ఐపీఎల్ సజావుగానే కొనసాగుతుంది అనుకుంటున్న సమయంలో దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విరుచుకుపడింది.  

2021 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య సోమవారం రాత్రి జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడబోతోందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ ప్రారంభంకావాల్సి ఉంది. కానీ కోల్‌కతా టీమ్‌లోని ఇద్దరు క్రికెటర్లలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో జట్టులోని మిగిలిన ఆటగాళ్లతో పాటు టీమ్ స్టాఫ్‌ కూడా ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.

దాంతో ఈరోజు మ్యాచ్‌ని వాయిదా వేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.కోల్‌కతా టీమ్‌లోని మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌కి పాజిటివ్‌గా తేలినట్లు వార్తలు వస్తున్నాయి.