అమెరికా అత్యవసర సాయం చేరింది!..

రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో సంక్షోభం నెలకొన్నది. ఈ క్రమంలో పలు దేశాలు ముందుకు వచ్చి సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా దేశాలు వైద్య పరికరాలు, ఇతర అవసరమైన సామగ్రిని పంపాయి. అగ్రరాజ్యం అమెరికా సైతం వంద మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించగా శుక్రవారం అమెరికా నుంచి భారత్‌ తొలి కొవిడ్ అత్యవసర సహాయ సామగ్రిని అందుకున్నది.  కొవిడ్‌ రెండో దశతో పోరాడుతున్న భారత్‌కు అమెరికా తన మొట్టమొదటి అత్యవసర వైద్య సాయాన్ని అందించింది.

అమెరికా నుంచి ఢిల్లీకి శుక్రవారం 440 ఆక్సిజన్‌ సిలిండర్లు, 9.60 లక్షల ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లతో పాటు లక్ష ఎన్‌-95 మాస్కులు, ఇతర వైద్య పరికరాలు కూడా చేరుకున్నాయి. అమెరికా వాయు సేనకు చెందిన సీ-5ఎం అనే విమానం ద్వారా ఈ సామగ్రిని రవాణా చేశారు. భారత్‌-అమెరికా మధ్య 70 ఏళ్లకుపైగా ఉన్న సహకార భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని, కొవిడ్‌పై పోరాటంలో భారత్‌కు అమెరికా అండగా ఉంటుందని ఆ దేశ రాయబార కార్యాలయం ఈ సందర్భంగా ట్విటర్‌లో పేర్కొంది. భారత్‌-అమెరికా మధ్య ఉన్న వైద్యరంగ భాగస్వామ్యం కరోనా మహమ్మారిని జయించగలదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి కూడా ట్వీట్‌ చేశారు. వైద్య సాయం చేసినందుకు అమెరికాకు భారత్‌ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత-అమెరికన్‌ స్వచ్ఛంద సంస్థ ‘సేవా ఇంటర్నేషనల్‌’ కూడా భారత్‌కు 2,184 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అట్లాంటా నుంచి పంపింది.

న్యూయార్క్‌లో ఉన్న అమెరికన్‌ ఇండియా ఫౌండేషన్‌ (ఏఐఎఫ్‌) కూడా 500 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను ఢిల్లీకి తరలించింది. అమెరికాకు చెందిన వీహెచ్‌పీ అనే ఎన్జీవో చికాగో నుంచి భారత్‌కు 500 ఆక్సిజన్‌ జనరేటర్లు, ఇతర వైద్య సామగ్రిని తరలించింది.  వచ్చే రోజుల్లో భారత్‌కు రూ.700 కోట్ల విలువైన అత్యవసర వైద్య సాయాన్ని అందిస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ మీడియాకు తెలిపారు. భారత్‌కు వైద్యసాయం అందించడానికి జపాన్‌ కూడా ముందుకు వచ్చింది. 300 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు ఇంకా ఇతర సామగ్రిని సమకూరుస్తామని ప్రకటించింది.  కరోనా రోగుల చికిత్సలో వినియోగిస్తున్న రెమ్‌డెసివిర్‌ కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం 4.5 లక్షల వయల్స్‌ దిగుమతి చేసుకుంటోంది. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల కోసం అమెరికా, ఈజిప్ట్‌, యూఏఈలలోని పలు ఔషధ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ సంస్థ హెచ్‌ఎల్‌ఎల్‌ ఆర్డర్లు ఇచ్చింది. దేశంలోనూ రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.