తియ్యటి వేడుక – ప్రపంచ చాక్లెట్ దినోత్సవం…ఈనాడే!

చాక్లెట్ అంటే ప్రేమకు గుర్తు. అంతే కాదు – చాక్లెట్‌లోని స్వీట్‌నెస్‌ని జీవితంలోనూ షేర్ చేసుకోవడం అని కూడా అర్థం. చాక్లెట్ పేరు వింటే చాలు అందరి నోట్లో నీరూరుతుంది. చిన్న పిల్లలతో మొదలుకొని వయోధికుల వరకూ అందరూ చాక్లెట్ను ఇష్టపడతారు. ఏ షాపుకు ఎక్కడికి వెళ్లినా దర్శనమిస్తుంది చాక్లెట్. చాక్లెట్ను చూస్తే భయపడాల్సిన అవసరం లేదు. మనోల్లాసంతోపాటు అద్భుతమైన ఆరోగ్యాన్నిస్తుందని పరిశోధనల ద్వారా తేల్చి చెప్పారు. చాక్లెట్ వచ్చే చెట్టు శాస్ర్తియ నామం థియోబ్రామా కకావ్. దీని అర్థం ‘దేవతల ఆహారం’. చాక్లెట్లు మొదటిసారిగా పరిచయం ఐరోపాలో 1550 జూలై 7న జరిగింది. అందుకే ఈ రోజును ‘చాక్లెట్ డే’గా కేటాయించారు. చాక్లెట్‌ని గిఫ్ట్‌గా ఇచ్చామంటే లైఫ్ లాంగ్ మెమరబుల్ ఫీలింగ్స్‌ని నీకందిస్తా అని కమిటిమెంట్ ఇచ్చినట్టే. బంధం ఏదైనా సరే వారితో ఓ చాక్లెట్‌ను పంచుకుంటే అదో తీయని అనుభూతిగా మారుతుంది. ప్రత్యేక సందర్భంగా మిగిలిపోతుంది.

istock 522735736

చిన్ని పిల్లలకు చాక్లెట్ చేతిలో పెడితే చిరునవ్వు కనిపిస్తుంది. మనసైన వారికి ఈ చాక్లెట్ గిఫ్ట్‌గా ఇస్తే బంధం బలపడుతుంది. ఎదుటివారిపై మీకున్న ప్రేమని, అభిమానాన్ని సూటిగా తెలియజేయాలంటే చాక్లెట్‌కి మించింది లేదు. పిల్లల నుంచి పెద్దల వరకు ఇలా అందరూ చాక్లెట్లంటే ఎంతగానో ఇష్టపడతారు. మనకు నచ్చిన వ్యక్తుల నుంచి ఈ చాక్లెట్లు అందుకుంటే మైమరచిపోతారు. పిల్లలకు మోతాదుకి మించకుండా చాక్లెట్లు ఇస్తే వారి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందట. పెద్దలు వారానికి ఓ రెండు సార్లు డార్క్ చాక్లెట్ తింటే బ్లడ్ ప్రషర్ తగ్గిస్తుందని పలు పరిశోధనల ద్వారా బయట పడింది. ఆరోగ్యం ప్రకారం చూస్తే, డార్క్ చాక్లెట్ బరువు తగ్గడానికి మంచిదిగా చెప్పబడుతుంది. అవేకాకుండా మానసిక సమస్యలతో డిప్రెషన్ బారిన పడేవారికి కూడా డార్క్ చాక్లెట్ ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ డార్క్ చాక్లెట్లలో కోకో ఎక్కువగా, పాలపదార్ధాలు తక్కువగా ఉంటాయి.

బ్లడ్ థిన్నర్‌గానూ ఈ డార్క్ చాక్లెట్ ఉపయోగపడుతుందట. ప్రేమికుల దినోత్సవం నాడు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 500 మిలియన్ డాలర్ల విలువైన చాక్లెట్ సేల్స్ జరుగుతాయట. ఏడాది మొత్తం చాక్లెట్ల సేల్స్‌లో దాదాపు 7 శాతం ఒక్క ఫిబ్రవరి 14వ తేదీనే జరుగుతాయట. ప్రపంచ వ్యాప్తంగా ఒక్క సంవత్సరంలో దాదాపు 7.8 మెట్రిక్ టన్నుల చాక్లెట్లను జనాలు తినేస్తున్నారట. స్వీట్ చాక్లెట్సే కాదు.. చేదు, వగరు, హాట్ ఇలా రకరకాల చాక్లెట్లు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి.