డాలర్ శేషాద్రికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా

Dollar Seshadri

స్పెషల్ డెస్క్- తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం చెందారు. గుండెపొటు రావడంతో సోమవారం తెల్లవారుజామున తుదిస్వాస విడిచారు. డాలర్ శేషాద్రి టీటీడీ ఆలయ విధుల్లో చేరినప్పటి నుంచి తన తుది శ్వాస వరకూ స్వామివారి సేవలోనే గడిపారు. డాలర్ శేషాద్రి 1977 జనవరి 26న టీటీడీ ఉత్తర పారుపత్తేధారుగా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్‌ గా, పత్తేధారు‌గా పదోన్నతి పొంది సుదీర్ఘ కాలం పనిచేశారు.

2006 జులై 31 న ఉద్యోగ విరమణ చేసి, ఆ తర్వాత ఔట్ సోర్సింగ్ కింద ఆలయ ఓఎస్డీగా పనిచేస్తూ వస్తున్నారు. తన 29 ఏళ్ల పదవీ కాలంలో శ్రీవారి ఆలయంలో అనేక పదవులు నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సుదీర్గంగా 2006 నుంచి ఇప్పటి వరకు 15 ఏళ్ల పాటు ఆలయ ప్రత్యేక అధికారి కొనసాగారు. శ్రీవారి ఆలయంలో విధులకు సంబంధించి నగలు నిర్వహణ చూసే బొక్కసం సెల్‌ లోని 13 రికార్డులు నిర్వహించేవారు డాలర్ శేషాద్రి.

ttd 1 1

వాస్తవానికి నగలు, నిర్వహణ బాధ్యత ఆలయ డిప్యూటీ ఈవో, పేస్కార్‌ లదే అయినా డాలర్ శేషాద్రి అన్నీ తానే చూసుకునేవారు. ఆయనకు డాలర్ శేషాద్రిగా పేరు రావడం వెనుక ఆసక్తిరమైన అంశం ఉంది. శేషాద్రి జాతక రాశి మేషరాశి కావడంతో మేక బొమ్మను డాలర్‌ గా ధరించాడు శేషాద్రి. తనకు దిష్టి తగలకుండా ఉండేందుకు మేక బొమ్మను ధరించినట్టు ఆయన ఓ సందర్భంలో చెప్పారు. అలా ఆయనకు డాలర్ శేషాద్రిగా పేరు వచ్చింది.

తిరుమల శ్రీవారి ఆలయానికి రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి, విదేశీ ప్రముఖులు, ఇతర వీఐపీలు వచ్చినప్పుడు వారి దగ్గరుండి స్వామి వారి దర్శనం చేయించేవారు డాలర్ శేషాద్రి. అంతే కాదు అవసరం అయినప్పుడు చీపురు పట్టుకుని శ్రీవారి ఆలయంలో శుభ్రం చేసేవారాయన. గతంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో నిర్లక్ష్యం చేశారు. తాజాగా మరోసారి గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందారు.