తెలుగు రాష్ట్రాలపై తుఫాను ప్రభావం.. రెండు రోజుల పాటు వర్షాలు

tauktea

విశాఖ-హైదరాబాద్- ఓ వైపు కరోనా, మరోవైపు తుఫాను భారత్ ను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే కరోనాతో నానా తంటాలు పడుతోంటే.. అదిచాలక గత నాలుగు రోజుల నుంచి తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తౌక్టే సైక్లోన్ ఇప్పటికే కేరళ, కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాలను ముంచెత్తగా.. ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్ లపై దాడి చేస్తోంది. తుఫాను దాటికి ఉత్తర తీర ప్రాంతం చిగురుటాకులా వణుకుతోంది. ఆరు రాష్ట్రాల్లో జన జీవనం అస్తవ్యస్థం అయిపోయింది. ఇక మన తెలుగు రాష్ట్రాలపై తౌక్టే తుపాను ప్రభావం కొంత మేర కనిపిస్తోంది. తౌక్టే తుపాను కారణంగా తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తౌక్టే తుఫాను ప్రభావంతో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అక్కడక్కడ కురుస్తున్న వర్షాల కారణంగా పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది.

cyclone

మరో రెండు రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వానలు పడతాయని ఐఎండీ పేర్కొంది. ఇక తౌక్టే తుపాను గుజరాత్‌ వద్ద తీరాన్ని తాకింది. ఆసమయంలో అరేబియా సముద్రంలో తౌక్టే బీభత్సం సృష్టించింది. గంటకు సుమారు 185 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. తుఫాను ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్‌‌లలో భారీ వర్షాలు జన జీవనాన్ని అస్థవ్యస్థం చేస్తున్నాయి. ముంబై సముద్ర తీరంలో అలలు 1.5 నుంచి 2 మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. తౌక్టే తుపాను పోర్‌బందర్‌ మహువాల మధ్య తీరం దాటింది. వెరవల్‌ సోమనాథ్‌ తీరంలో సముద్ర అలలు ఎగసిపడ్డాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించగా, వారికి ఆహారం, వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు తుఫాను ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.