ప‌ల్స్ ఆక్సీమీట‌ర్లు ఎలా ప‌నిచేస్తాయి?!.

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వివ‌రాల ప్ర‌కారం ‘క్లిప్‌’ లా క‌నిపించే ఈ ప‌రిక‌రాన్ని ఎక్కువ‌గా చూపుడు వేలికి అమ‌రుస్తుంటారు. కొన్నిసార్లు మిగ‌తా చేతి వేళ్ల‌తోపాటు, కాలి వేళ్లు, చెవికి కూడా అమ‌రుస్తుంటారు. దీన్నే ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ అంటారు. ఒక‌ప్పుడు జ్వ‌రం వ‌స్తే వాడే థ‌ర్మామీట‌ర్ గురించి మాత్రమే అంద‌రికీ తెలుసు. కానీ ఇప్పుడు క‌రోనా పుణ్యమా అని శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయుల‌ను చెక్ చేసే ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ గురించి కూడా చాలామందికి తెలిసిపోయింది. క‌రోనా సెకండ్ వేవ్‌లో ఎక్కువ మంది శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌తోనే బాధ‌ప‌డుతున్నారు.

ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ప‌డిపోవ‌డంతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో శ‌రీరంలోని ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మానిట‌ర్ చేసుకుంటూ  ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డానికి ఈ ప‌ల్స్ ఆక్సీమీట‌ర్లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. అందుకే ప్ర‌తి ఒక్క‌రూ ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ల‌ను ద‌గ్గ‌ర ఉంచుకోవ‌డం మంచిద‌ని వైద్యులు కూడా సూచిస్తున్నారు. మ‌న శ‌రీరంలోని వివిధ భాగాల‌కు ఆక్సీజ‌న్‌ను గుండె ఎలా స‌ర‌ఫ‌రా చేస్తుందో ఈ ఆక్సీమీట‌ర్‌తో తెలుసుకోవ‌చ్చు. ర‌క్తంలోని ఆక్సీజ‌న్ స్థాయిలు త‌గ్గే వ్యాధుల‌తో బాధ‌ప‌డే రోగుల‌ ఆరోగ్యాన్ని ప‌ర్య‌వేక్షించేందుకు దీన్ని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు. క్రోనిక్ అబ్‌స్ట్ర‌క్టివ్ ప‌ల్మ‌న‌రీ డిసీజ్ (సీవోపీడీ), ఆస్థ‌మా, న్యుమోనియా, ఊపిరితిత్తుల క్యాన్స‌ర్‌, ర‌క్త హీన‌త‌, గుండె జ‌బ్బుల చికిత్స‌లో దీని అవ‌స‌రం ఎక్కువ ఉంటుంది.

116589470 gettyimages 1295458322

మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లో ఫిల్ట‌ర్ అవుతుంది. ఆ త‌ర్వాత ఎర్ర ర‌క్త క‌ణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ద్వారా శ‌రీరం మొత్తం ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా అవుతుంది. హిమోగ్లోబిన్‌లో ఉండే ఆక్సిజ‌న్ స్థాయిని ప‌ల్స్ ఆక్సీమీట‌ర్లు లెక్కిస్తాయి. ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ చిన్న క్లిప్ మాదిరి ఉంటుంది. దీన్ని చేతి వేలికి గోరు భాగంలో పెట్టుకోగానే ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను రీడింగ్ రూపంలో చూపిస్తుంది. సాధార‌ణంగా ఆరోగ్యంగా ఉన్న వారిలో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ 95 నుంచి 99 శాతం వ‌ర‌కు ఉంటాయి. అదే ఆక్సిజ‌న్ 92 శాతం వ‌ర‌కు స్థిరంగా ఉంటే ఫ‌ర్వాలేదు. కానీ అంత‌కంటే త‌గ్గితే మాత్రం వైద్యుడిని సంప్ర‌దించ‌డం మంచిది.

ప‌ల్స్ ఆక్సీమీట‌ర్‌ను చేతి వేలికి పెట్టుకోగానే అది ఇన్‌ఫ్రారెడ్ కిర‌ణాల‌ను ర‌క్త‌కేశ నాళిక‌ల్లోకి పంపుతుంది. అప్పుడు ఇన్‌ఫ్రారెడ్ కిర‌ణాల నుంచి వెలువ‌డిన కాంతిని ర‌క్త‌నాళాల‌ను గ్ర‌హించడంలో వ‌చ్చే మార్పు ఆధారంగా ఇది ఆక్సిజ‌న్ శాతాన్ని కొలుస్తుంది. ఆక్సీమీట‌ర్ హృద‌య స్పంద‌న రేటు కూడా చూపిస్తుంది. ప‌ల్స్ ఆక్సీమీట‌ర్‌ను ఎక్కువ‌గా చూపుడు వేలుకు పెట్టుకుంటారు. మ‌ధ్య వేలుకు ప‌ల్స్ ఆక్సీమీట‌ర్‌ను పెట్టుకొని కూడా ఆక్సిజ‌న్ లెవల్స్‌ను చెక్ చేసుకోవ‌చ్చు. ఇది 98 శాతం క‌చ్చిత‌మైన రీడింగ్ చూపిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. చేతి గోళ్ల‌కు ఏదైనా నెయిల్ పాలిష్ ఉంటే తొల‌గించాలి. చేతులు చ‌ల్ల‌గా ఉంటే వెచ్చ‌ద‌నం కోసం రెండు నిమిషాలు చేతులు రుద్దుకోవాలి.

ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ వాడే ముందు క‌నీసం 5 నిమిషాలు ఏ ఆలోచ‌న లేకుండా విశ్రాంతి తీసుకోవాలి. ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను ప్ర‌తిరోజు ఒకే స‌మ‌యంలో మూడుసార్లు రికార్డు చేయాలి. ఊపిరి తీసుకోవ‌డం క‌ష్టంగా అనిపించినా  ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ 92 శాతం త‌క్కువ‌గా ఉన్నా వైద్య స‌హాయం కోసం 1075కి కాల్ చేయాలి. లేదా వైద్యుల‌ను సంప్ర‌దించాలి.