దాగుడు మూతలు ఎందుకన్న హైకోర్టు

హైదరాబాద్- తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏప్రిల్ 30తో రాష్ట్రంలో కర్ఫ్యూ మూగుస్తున్న నేపధ్యంలో తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోనుందనే దానిపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. 30తో కర్ఫ్యూ ముగిసిన తరువాత తదుపరి చర్యలు ఏమిటని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రేపు పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఏమిటంటూ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. నియంత్రణ చర్యలపై దాగుడు మూతలెందుకని సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం ఒక రోజు ముందు నిర్ణయం తీసుకుంటే వచ్చే నష్టమేంటని ధర్మాసనం మండిపడింది. నియంత్రణ చర్యలపై తాము ఎలాంటి సూచనలూ ఇవ్వడం లేదని హైకోర్టు తెలిపింది. క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వమే తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ప్రభుత్వాన్ని సంప్రదించి మధ్యాహ్నం లోగా తదుపరి తీసుకునే చర్యలేంటో చెబుతానని అడ్వకేట్ జనరల్ ఏజీ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు చెప్పారు. దీంతో విచారణ మధ్యహ్నానానికి వాయిదా పడింది.