నా మొదటి ఫ్లైట్ టికెట్ కోసం నాన్న ఏడాది కష్టపడ్డారు: సుందర్ పిచాయ్

జీవితంలో ఎంత ఎత్తుకి ఎదిగిన వారికైనా.., గతంలో కొన్ని చేదు జ్ఞాపకాలు ఉంటాయి. వాటి నుండి ఎప్పుడు ప్రేరణ పొందుతూనే ఉండాలి. మనం ఆ కష్టాలను దాటిన విధానం పది మందికి స్ఫూర్తిగా నిలవాలి. వీరినే అసలైన విజేతలు అంటారు. అచ్చం ఇలాంటి సక్సెస్ స్టోరీనే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ది. ఓ సామాన్య కుర్రాడు.. గూగుల్ సీఈఓ అవ్వడం అంటే మాటలు కాదు. దాని వెనుక ఎన్నో ఏళ్ళ కష్టం ఉంటుంది. కృషి ఉంటుంది. పట్టుదల ఉంటుంది. కానీ.. ఎంత కష్టపడ్డా ఆ ధైర్యాన్ని ఇచ్చే మనిషి ఒకరు ఉంటారు. సుందర్ పిచాయ్ జీవితంలో కూడా అలా ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి ఒకరున్నారు. ఆయన ఎవరో కాదు.. తన తండ్రి రఘునాథ పిచాయ్. తన అభివృద్ధి కోసం తన తండ్రి పడ్డ కష్టాలను, అనుభవించిన బాధలను సుందర్ పిచాయ్ తాజాగా బయటపెట్టారు.

pichy 2డియర్ క్లాస్ ఆఫ్ 2020 పేరుతో గూగుల్ సంస్థ ఓ వర్చువల్ గ్రాడ్యుయేషన్ సెరెమనీని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుందర్ పిచాయ్ విద్యార్థుల్లో దైర్యం నింపే విధంగా ప్రసంగించారు. కరోనాతో అంతా అయిపోయింది అనుకుని బాధపడకండి. ప్రతి జనరేషన్ ఏదో ఒక కష్టాల నడుమే విజయాన్ని అందుకుంది. 1920లో కాలం నాటి విద్యార్థులకు ఫ్లూ మహమ్మారి సవాల్ విసిరింది. 1970లో విద్యార్థులు వియత్నాం వార్ జరుగుతున్నప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ భవనాలపై ఉగ్రవాద దాడులు జరిగాక.., 2001 గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగ అవకాశాలే లేకుండా పోయాయి. కానీ.., వారంతా ఆ కష్టాలని దాటి విజేతలు అయ్యారు. ఇప్పుడు మనల్ని సవాలు చేస్తున్న కరోనా కూడా అంతే. కరోనా మన జీవితాలను నిర్దేశించలేదు అంటూ పిచాయ్ కాస్త భావోద్వేగంగా ప్రసంగించారు.

ఇదే సమయంలో పేదరికం కారణంగా తాను ఎదుర్కొన్న కష్టాలను కూడా చెప్పుకొచ్చాడు సుందర్ పిచాయ్. తాను చదువుకునే కాలంలో పెద్దగా టెక్నాలజీ అందుబాటులో లేదు. కానీ.., నేను దాని మీదే ఇష్టం పెంచుకున్నాను. నా చదువు కోసం మా నాన్న పడ్డ కష్టాలు ఇంకా నా కళ్ళ ముందే ఇంకా కదిలాడుతున్నాయి. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో హైయర్ ఎడ్యుకేషన్ కోసమే నేను మొదటిసారి విమానం ఎక్కాను. ఆ విమాన టికెట్ కోసం నా తండ్రి తన ఏడాది సంపాదనని ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇంటికి కాల్ చెయ్యాలంటే రూ.90 ఖర్చు అయ్యేవి. అందుకే నెలలు తరబడి ఇంట్లో వాళ్ళతో మాట్లాడకుండా ఉండేవాడిని. నాకు ఒక్క బ్యాగ్ కొనివ్వడానికి మా నాన్న ఒక నెల శాలరీ ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కానీ.., ఏ సమయంలోనూ మా నాన్న నా చదువుని భారంగా భావించలేదు. ఈరోజు నేను ఈ పొజిషన్ ఉన్నాను అంటే.., అది లక్ ఎంత మాత్రం కాదు. మా నాన్న కష్టం. నా కృషి అందుకు కారణమని సుందర్ పిచాయ్ తన అనుభవాల్ని పంచుకున్నారు. సుందర్ పిచాయ్ తన తండ్రి గురించి భావోద్వేగంతో చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాన్న ప్రేమ ఇంత గొప్పగా ఉంటుందంటూ అంతా రఘునాథ పిచాయ్ కష్టానికి నెటిజన్స్ అంతా సెల్యూట్ చేస్తున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.