మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు అస్వస్థత, ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స

న్యూ ఢిల్లీ- భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్‌ సింగ్‌ (88) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేర్చారు. జ్వరం, ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన మన్మోహన్ సింగ్ కు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. జ్వరంతో పాటు నీరసంతోనూ ఆయన బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా నేతృత్వంలోని వైద్య బృందం మన్మోహన్ సింగ్ కు చికిత్స అందిస్తోంది.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ సంవత్సరం ఏప్రిల్ 19న కరోనా సోకి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుని కోలుకున్నారు. అప్పటి నుంచి ఆరోగ్యంగానే ఉన్న ఆయన, ఉన్నట్లుండి బుధవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. మన్మోహన్ సింగ్ మార్చి 4న, ఏప్రిల్ 3న కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. 2009లో ఆయనకు ఎయిమ్స్ లో బైపాస్ సర్జరీ అయ్యింది.

Manmohan

ఇక మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారని తెలియడంతో కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధి, రాహూల్ గాంధి సహా పలువురు రాజకీయ ప్రముఖులు మన్మోహన్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అన్నట్లు మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు రెండు సార్లు భారత్ కు ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఆర్ధిక రంగ చాణుక్యుడిగా పేరున్న మన్మోహన్ సింగ్ గతంలో పీవీ నరసింహా రావు క్యాబినెట్ లో ఆర్ధిక మంత్రిగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో ఎన్నో ఆర్ధిక సంస్కరణలు తీసుకువచ్చారు.