ప్రతి ఒక్కరి అకౌంట్ లో 10వేలు.. ఏపీలో మత్సకార భరోసా పధకం

అమరావతి- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కష్ట కాలంలో సంక్షేమ పధకాల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కరోనా నేపద్యంలో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో వారికి పెద్ద ఎత్తున ఆర్ధిక సాయం చేస్తోంది జగన్ సర్కార్. ఇందులో భాగంగానే మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేలా వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది జగన్ ప్రభుత్వం. ఈ పధకం కింద ఇప్పుడు సాయం అందింస్తున్నారు. మత్స్య కారులైన లబ్ధిదారుల బ్యాంక్‌ అకౌంట్లలో నేరుగా డబ్బు జమ చేస్తున్నారు. మొత్తం 1 లక్షా 19 వేల 875 కుటుంబాలకు 10 వేల రూపాయల చొప్పున 119 కోట్ల 87 లక్షల 50 వేల రూపాయల మేర వారి వారి అకౌంట్లలో జమ చేస్తున్నారు.

ysr scheme

గడిచిన రెండేళ్లలో మత్స్యకారులకు 211 కోట్ల 71 లక్షల రూపాయలను చెల్లించారు. ఈ ఏడాది మరో 119 కోట్ల 87 లక్షల రూపాయలతో కలిపి మూడేళ్లలో 331.58 కోట్ల మేర లబ్ధి చేకూరుతోంది. మత్స్యకారులకు గతంలో 4 వేల రూపాయల చొప్పున మాత్రమే ఇచ్చిన భృతిని, గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాజగన్ ప్రభుత్వం 10 వేల రూపాయలకు పెంచింది. రెండేళ్లుగా ఏటా క్రమం తప్పకుండా వేట నిషేధ సమయంలోనే భృతిని అందజేస్తూ మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటూ వస్తోంది. ఈ ఏడాది కూడా తమకు ఆర్ధిక సాయం చేస్తున్నందుకు మత్స్య కారులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో ఆర్దికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు 10వేల చొప్పున సాయం అందించింనందుకు జగన్ సర్కార్ కు కృతజ్ఞతలు చెబుతున్నారు.