ఢిల్లీ, సిడ్నీ, బీజీంగ్.. చైనా రాకెట్ ఎక్కడైనా పడొచ్చని అంచనా

ఇంటర్నేషనల్ డెస్క్- ఇప్పుడు మొత్తం ప్రపంచం దృష్టి అదుపు తప్పిన చైనా రాకెట్‌ లాంగ్‌ మార్చ్‌ 5బీ పైనే  ఉంది. ఈ రాకెట్ మరో 48 గంటల్లో భూమిని తాకొచ్చని అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. దీంతో ఈ రాకెట్‌ ఏ దేశంలో పడుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఖగోళ శాస్త్రజ్ఞుడు జొనాథన్‌ మెక్‌ డోవెల్‌ పలు విషయాలు వెల్లడించారు. చైనా రాకెట్‌ లాంగ్‌ మార్చ్‌ 5బీ భారత రాజధాని ఢిల్లీ పైన పడే అవకాశాలు ఉన్నాయని ఆయన అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం, బ్రెజిల్‌ లోని రియో డీ జెనీరియో నగరంతో పాటు చైనాలోని బీజింగ్‌ లో కూడా పడే అవకాశాలు ఉన్నాయని జొనాథన్‌ చెబుతున్నారు. ప్రస్తుతం ఆ రాకెట్‌ సెకనుకు 4 మైళ్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోందట.

భూమధ్యరేఖకు ఉత్తర, దక్షిణ భాగాలలో 41 డిగ్రీల మధ్య ఉండే ప్రాంతాల్లో ఎక్కడైనా లాంగ్‌ మార్చ్‌ 5బీ కుప్పకూలొచ్చని ఖగోళ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. చైనా రాకెట్ ను అదుపులోకి తీసుకొని, సముద్రం లేదా నిర్జన ప్రదేశాల వైపు మళ్లించేందుకు చైనా విశఅవ ప్రయత్నాలు చేస్తోంది. లాంగ్‌ మార్చ్‌ 5బీ రాకెట్ భూమికి 165 నుంచి 292 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో ఉందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ హెడ్ హోల్గర్ క్రాగ్ చెప్పారు. ఈ రాకెట్‌ను ఆస్ట్రియాకు చెందిన ఒక లేజర్ ట్రేస్ చేసినట్లు ఆయన చెబుతున్నారు. ఈ రాకెట్ అదుపు తప్పి భూమి మీద కూలిపోయినా ఎటువంటి నష్టం ఉండదని హోల్గర్ క్రాగ్ స్పష్టం చేశారు.

ఈ విషయంలో నిపుణుల మాటలు వినాలని, వారి అభిప్రాయం ప్రకారం రాకెట్ చాలా భాగం భూ వాతావరణంలో ప్రవేశించగానే మండిపోతుందని చైనా అంటోంది. ఒక వేళ చిన్న చిన్న భాగాలు ఉన్నా అవి పసిఫిక్ మహాసముద్రంలో పడతాయని, దీని వల్ల ఎవరికీ నష్టం లేదని చెబుతోంది. మరోవైపు ఈ చైనా రాకెట్ కచ్చితంగా ఏ ప్రాంతంలో కూలుతుందో చెప్పలేమని అమెరికా, తదితర పాశ్చాత్య దేశాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరో 24 గంటలు గడిచాక చైనా రాకేట్ ఎక్కడ పడుతుందో ఖచ్చితంగా అంచనా వేయెచ్చని ఖగోళ నిపుణులు చెబుతున్నారు.