కర్ణాటకలో చిన్నపిల్లలపై కరోనా విసుర్తోన్న పంజా!

దేశంలో మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా కర్ణాటకలో పిల్లల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత మార్చి నెల నుంచి ఈ నెల 18 వరకు కర్ణాటకలో నమోదైన కేసులను పరిశీలిస్తే 0-9 ఏళ్ల మధ్య చిన్నారుల్లో 39,846 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 10-19 వయస్సున్న వారిలో 1,05,044 మంది వైరస్ బారినపడ్డారు. సెకండ్ వేవ్‌లో పిల్లల మరణాలు గతంతో పోలిస్తే మూడు రెట్లు, కౌమారదశలోని వారి మరణాలు రెండు రెట్లు అధికంగా ఉన్నాయి. తొలిదశలో పెద్దవయసు వారు, సెకండ్ వేవ్‌లో యువత ఎక్కువగా కరోనా బారినపడ్డారు. వైరస్‌లో మ్యుటేషన్ జరిగినప్పుడు, ప్రాథమిక కరోనావైరస్ వ్యాక్సీన్ వేసుకోని జనాభాపై ఎక్కువగా దాని ప్రభావం ఉంటుంది. ఇప్పుడు 45ఏళ్లకుపైబడిన వారికి వ్యాక్సీన్లు ఇస్తున్నారు. అందుకే వీరిలో కేసుల సంఖ్య తగ్గింది. మరోవైపు పిల్లలు, యువతలో కేసుల సంఖ్య పెరుగుతోంది. పెద్దవారితో పోలిస్తే పిల్లల్లో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది. థర్డ్ వేవ్‌లో చిన్నారులకు ముప్పు పొంచి ఉందనే ఆందోళన నెలకొంది. పిల్లలు ఎక్కువగా వైరస్ బారినపడడానికి కొత్త మ్యుటెంట్లు కారణమా? అనే సందేహాలు తీరకముందే కర్ణాటకలో చిన్నారుల్లో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.

images 20

ఇంట్లో కరోనా సోకిన పెద్దవాళ్ల ద్వారానే వారికి ప్రైమరీ కాంటాక్ట్‌లుగా ఉన్న పిల్లలు వైరస్ బారినపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు సుప్రజా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కరోనా బారినపడుతున్న చిన్నారుల్లో ప్రతి 10 మందిలో ఒకరికి మాత్రమే ఆస్పత్రిలో చికిత్స అవసరం అవుతుందని, మిగిలిన వారికి ఇంటి వద్దే చికిత్స అందించవచ్చని చెప్పారు. పిల్లల్లో జ్వరం, దగ్గు, విరోచనాలు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కొవిడ్ పరీక్ష చేయించాలని సూచించారు.