ఒకే రోజు పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు 9ఏళ్ల తర్వాత అదే రోజు చనిపోయారు. వారిద్దరూ అన్నదమ్ముల కుమారులు. తమ సంతానంలో చెరొక వారసుడు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. శోకసంద్రంలో మునిగిపోయిన ఆ రెండు కుటుంబాల సభ్యులను చూసి గ్రామస్తులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత విషాదకరమైన ఈ సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలోని మెదక్ జిల్లా కొల్చారం మండలం కొంగోడ్కు చెందిన షేకులు, లాలయ్య అన్నదమ్ములు. షేకులు దంపతులకు ఇద్దరు కుమారులు. లాలయ్య దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. షేకులు కుమారుడు అజయ్, లాలయ్య కుమారుడు నర్సింలు 2013 మే 22న జన్మించారు. చిన్నప్పటి నుంచి ఇద్దరు అన్నదమ్ములు కలిసి మెలిసి ఉండేవాళ్లు. కొంగోడ్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నారు. వారిద్దరూ మధ్యాహ్న భోజనం అనంతరం విరామ సమయంలో పాఠశాలకు సుమారు 300 మీటర్ల దూరంలో ఉన్న నీటి కుంట వద్దకు వెళ్లారు.
నీటి కుంటకు కాళ్లకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన ఇద్దరూ అన్నదమ్ములు ఎంతసేపటికి రాకపోవడంతో లక్ష్మణ్ అనే మరో విద్యార్ధి నీటి కుంట దగ్గరకు వెళ్లి చూడటంతో అజయ్, నర్సింహులు నీళ్లలో మునిగిపోయి.. రక్షించమని అరుస్తున్న దృశ్యం కనిపించడంతో.. పరుగెత్తుకెళ్లి ఇంఛార్జి ప్రధానోపాధ్యాయుడు నవీన్‌కుమార్‌కు చెప్పాడు. హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లి కొన ఊపిరితో ఉన్న అజయ్‌ను బయటకు తీసి మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు. పోలీసులు, గ్రామస్థుల సాయంతో గుంతలో నుంచి నర్సింలు మృతదేహం వెలికితీశారు.
అజయ్, నర్సింహులు ఒకే రోజున జన్మించారు. సరిగ్గా 9సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరు అన్నదమ్ములు దురదృష్టవశాత్తు అదే రోజు చనిపోవడంతో ఇద్దరు పిల్లల తల్లిదండ్రులైన షేకులు, లాలయ్య దంపతులు బోరున విలపించారు. బడికి ప్రహరీ గోడ, సరైన మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడం వల్లే.. ఈ దారుణ ఘటన జరిగిందని.. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్కూల్‌లో మరుగుదొడ్లు నిర్మించాలని కోరుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.