దేశంలో ఇప్పటి వరకు ఎన్నో బ్యాంకు కుంభకోణాలు వెలుగు చూశాయి. బ్యాంకుల నుంచి వేల కోట్లు రుణాలు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మొహుల్ చోక్సీ. తాజాగా భారత్ లో మరో భారీ స్కామ్ బయటపడింది. ఇప్పటి వరకు ఏబీజీ షిప్ యార్డు 20 వేల కోట్ల రూపాయలు, నీరవ్ మోడీ చేసిన 13 వేల కోట్ల రూపాయల స్కామ్ లే అతి పెద్ద బ్యాంకు మోసాలుగా ఉన్నాయి. తాజా స్కామ్ తో అవి కూడా వెనక్కిపోయాయి. ఏకంగా 17 బ్యాంకులను అక్షరాల రూ.34,615 కోట్ల మేర ముంచారు. వివరాల్లోకి వెళితే..
బ్యాంక్‌లను రూ.34,615 కోట్లు మోసం చేశారన్న ఆరోపణలపై దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్) ఆ సంస్థ మాజీ సీఎండీ కపిల్ వాధ్వాన్, డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్, ఇతరులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. ఇప్పటి వరకూ సీబీఐ నమోదు చేసిన అతిపెద్ద బ్యాంకింగ్ మోసం ఇదే అన్నారు అధికారులు. ఈ నెల 20న ఈ కేసు రిజిష్టర్ చేసామని, ఇందుకు సంబంధించి ముంబైలో అమరెల్లీస్ రియాల్టర్స్ అధిపతి సుధాకర్ శెట్టి, మరో 8 మంది బిల్డర్లకు చెందిన 12 ఆవరణల్లో 50 మందితో కూడిన బృందం సోదాలు నిర్వహించినట్లు బుధవారం సీబీఐ అధికారులు చెప్పారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్‌ఐఆర్ రిజిష్టర్ చేసినట్టు వారు తెలిపారు.
2010-18 మధ్య యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో 17 బ్యాంకుల కన్సార్షియం రూ.42,871 కోట్ల విలువైన రుణాలను ఇచ్చింది. ఇంకా 34,615 కోట్ల రూపాయలు బాకీ ఉంది. 2019లో దీన్ని ఎన్ పీఏగా ప్రకటించగా.. 2020లో దీన్ని మోసంగా గుర్తించారు. 2020-21 సంవత్సరాల్లో కెపీఎంజీ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. కపిల్, ధీరజ్‌లు నిజాల్ని కప్పిపుచ్చుతూ.. విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని, 2019 మే నుంచి రుణ చెల్లింపులను ఎగవేస్తూ రూ.34,614 కోట్ల మేర ప్రజా ధనాన్ని మోసం చేశారని, కుట్రపూరితంగా ప్రవర్తించారని బ్యాంకు ఆరోపించింది.
డీహెచ్‌ఎఫ్‌ఎల్ ఖాతా పుస్తకాలపై ఆడిట్‌లోనూ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, నిధులను మళ్లించారని, పుస్తకాల్లో గణాంకాలను మార్చారని, తద్వారా కపిల్, ధీరజ్‌లు సొంత ఆస్తులు పెంచుకున్నారని.. ఇదంతా ప్రజా ధనంతో చేశారని ఆరోపణలు చేసింది. వాస్తవానికి డీహెచ్‌ఎఫ్‌ఎల్ నిధులు మళ్లిస్తున్నదంటూ మీడియాలో 2019 జనవరిలో వార్తలు వెలువడంతో కంపెనీ ఖాతాపుస్తకాల్ని ఆడిట్ చేయడానికి కేపీఎంజీని బ్యాంక్‌లు నియమించాయి. కపిల్, ధీరజ్ వాధ్వాన్‌లు దేశం విడిచివెళ్లకుండా అదే ఏడాది అక్టోబర్‌లో బ్యాంక్‌లు లుక్‌అవుట్ నోటీసుల్ని జారీచేసాయి. ఈ బ్యాంకు కుంభకోణం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.